అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, March 11, 2013

ఫోన్ల ట్యాపింగ్‌, మెయిల్స్‌ తనిఖీ : మొబైళ్లు, అంతర్జాలంపై పెరిగిన నిఘా

అనుమతి కోసం సగటున రోజూ 13 వినతులు
అమెరికా తర్వాత అధిక ఆరా మనదే
రాష్ట్రంలోనూ పెరుగుతున్న ఫోన్ల ట్యాపింగ్‌
మెయిల్లో ఏముంది..!
ఆ వెబ్‌సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు?
ఏ వీడియోను ఎవరు అప్‌లోడ్‌ చేశారు!
అనుమానాస్పద వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు..!
వంటి అంశాలపై నిఘా ప్రస్తుతం మరింత పెరిగింది. ఇప్పటికే ఇలాంటి 'ట్యాపింగ్‌' అమల్లో ఉండగా.. మారిన అవసరాల దృష్ట్యా నిఘాను మరింత పెంచారు. ఇందులో భాగంగా అంతర్జాల దిగ్గజం గూగుల్‌కి రోజూ సగటున 13 వినతులు అందుతున్నాయి. అనుమానాస్పద ఈమెయిళ్లు.. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లో ఇతర సమాచారాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు సంస్థలు గూగుల్‌ను కోరుతున్నాయి. ఒక్క 2012లో అమెరికా గూగుల్‌కి 16407 వినతులు పంపితే.. దాని తర్వాత స్థానంలో భారత్‌ ఉంది. మన దేశం నుంచి 4750 వినతులు వెళ్లాయి. తర్వాతి స్థానంలో ఫ్రాన్స్‌ 3239, జర్మనీ 3083, యూకే 2883, బ్రెజిల్‌ 2777 ఉన్నాయి. 20011తో పోల్చితే ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. ఈ మేరకు గూగుల్‌ తాజా పారదర్శక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌ నుంచి గూగుల్‌కి 2011లో 3946 వినతులు అందగా.. తర్వాతి సంవత్సరం ఆ సంఖ్య పెరిగింది. వీటిలో ఎక్కువగా సమాచారం, చిత్రాలు, వెబ్‌సైట్ల తొలగింపునకు సంబంధించినవి ఉంటున్నాయని గూగుల్‌ వివరించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 360 వెబ్‌ పేజీలను తొలగించినట్లు తెలిపింది.
వీరికే ఆ అధికారం
ప్రస్తుతం ఫోన్‌ను ట్యాప్‌ చేసే అధికారం ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా, సీబీఐ, ఎన్‌ఐఏ, సీబీడీటీ, డీఐఏ, డీఆర్‌ఐ, నార్కెటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఈడీ, ఆదాయపన్ను, రాష్ట్ర పోలీసు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఉంది. 1885 భారత టెలిగ్రాఫ్‌ చట్టం సెక్షన్‌ 5(2) ప్రకారం వీరు ఈ ఫోన్‌ నంబరును అయినా హోం శాఖ అనుమతితో ట్యాప్‌ చేయొచ్చు. నిఘా సంస్థలు ఫోన్‌ ట్యాపింగ్‌కి దరఖాస్తు చేస్తే.. హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెలికం, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కూడిన కమిటీ దాన్ని పరిశీలించి ట్యాపింగ్‌కు అనుమతిస్తుంది.

10 వేల ఫోన్‌ నంబర్లు
క మొబైళ్ల విషయానికి వస్తే ప్రస్తుతం నిఘా వర్గాలు దేశ వ్యాప్తంగా దాదాపు 10 వేల మొబైల్‌ నంబర్లను అధికారికంగా ట్యాప్‌ చేస్తున్నాయి. వీటిలో 4490 మొబైళ్లను గతంలోనే ట్యాపింగ్‌ జాబితాలో చేర్చారు. కాగా డిసెంబరులో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల్లోనే 5080కిపైగా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు కేంద్ర హోం శాఖ వర్గాల సమాచారం. పలు నిఘా సంస్థలు, పోలీసులు, సైన్యం అవసరాల మేరకు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు. ఈ నంబర్ల జాబితాలో అత్యధికం ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర అసాంఘిక శక్తులకు సంబంధించినవి ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలోనూ పెరుగుతున్న ధోరణి
హోం శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోనూ పెరుగుతోంది. ప్రస్తుతం ట్యాపింగ్‌కి గురౌతున్న దాదాపు 10 వేల నంబర్లలో 5300 ఫోన్లను ఇంటెలిజెన్స్‌ బ్యూరో పర్యవేక్షిస్తోంది. వీటిలో 2100 నంబర్లను ఒక్క డిసెంబరులోనే తమ ట్యాపింగ్‌ జాబితాలో చేర్చింది. ఇదే నెలలో రాష్ట్రం నుంచి 597 ఫోన్‌ నంబర్ల ట్యాపింగ్‌ కోసం హోం శాఖకు వినతులు వెళ్లాయి. ఇక సైన్యం 800, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ 160, ఇతర నిఘా సంస్థలు 764 ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నాయి.
రూ.400 కోట్లతో పక్కా వ్యవస్థ
ఫోన్‌ ట్యాపింగ్‌లో వెల్లడైన విషయాలు ఏమాత్రం బహిర్గతం కాకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పర్యవేక్షణ వ్యవస్థ (సీఎంఎస్‌)ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.400 కోట్లు ఖర్చుపెడుతోంది. దీన్ని వచ్చే నెల నుంచి ప్రయోగాత్మంగా అమలు చేసి.. వచ్చే సంవత్సరం ఆగస్ట్‌ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ వ్యవస్థతో కేవలం ప్రభుత్వ అనుమతితో టెలికం సేవలు అందించే వారి ప్రమేయం లేకుండా ఫోన్లను ట్యాప్‌ చేసే వీలుంది. ఈ వ్యవస్థతో ట్యాపింగ్‌కి మనుషుల అవసరం కూడా ఉండదు. ఈ వ్యవస్థ కోసం దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో టీసీఐఎస్‌ (టెలిఫోన్‌ కాల్‌ ఇంటర్‌సెప్షన్‌ సిస్టం)ను ఏర్పాటు చేస్తారు. ఇది ఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌, జీపీఆర్‌ఎస్‌, వాయిస్‌ కాల్స్‌, ఫ్యాక్స్‌, ల్యాండ్‌లైన్లు, సీడీఎంఏ, జీఎస్‌ఎం, త్రీ నెట్‌వర్క్‌లు, వీడియో కాల్స్‌పై నిఘా ఉంచుతుంది. దీన్ని సీఎంఎస్‌కి అనుసంధానం చేసి అక్కడ అవసరమైన నంబర్లను ట్యాప్‌ చేస్తారు. ఒక్కసారి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఒక నంబరును స్వయంచాలితంగా ట్యాప్‌ చేసి.. ఆ వివరాలను తొలగించొచ్చు. ఈ వ్యవస్థలో ఒక నంబరును అనుసంధానం చేయాలంటే హోం శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. * 72 గంటల పాటు నిఘా సంస్థలు ఏ ఫోన్‌ని అయినా ప్రభుత్వ అనుమతి లేకనే ట్యాప్‌ చేయొచ్చు.
* 180 రోజుల పాటు హోం శాఖ అనుమతితో ఫోన్‌ను ట్యాప్‌ చేయొచ్చు. తర్వాత ప్రతి 60 రోజులకు ఒకసారి హోం శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment