అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, February 28, 2013

రైల్వే బడ్జెట్‌లో రంగారెడ్డిజిల్లా ఊసేలేదు...

కలల్లోనే రైళ్లు.. కాగితాల్లో హామీలు..
కొత్త బడ్జెట్‌లోనూ జిల్లా వాసికి నిరాశే
ఈనాడు, రంగారెడ్డిజిల్లా
కొత్త రైళ్లు వస్తాయన్న ఆశలు ఆవిరైపోయాయి. .ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామన్న మాటలు గాలిలో కలసిపోయాయి. రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లా వూసే కనిపించకుండా పోయింది.ప్రజల సౌకర్యం..వాణిజ్య అవసరాలు దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. జిల్లా నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలకూ మంత్రి పదువులు ఉన్నా..జిల్లాకు ఈ పదవులు ఒక్క మేలు కూడా చేయలేకపోయాయి. కొత్త రైలు ఈసారీ లేనట్లే..
వికారాబాద్‌-కృష్ణా రైల్వేలైన్‌ నిర్మాణం చేపడతామని మూడేళ్ల క్రితం అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతాబెనర్జీ రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడుతూ హామీ ఇచ్చారు.ఆ తరవాత సర్వే మాత్రం జరిగినా రైల్వే శాఖ నుంచీ ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు.ఈ రైల్వే లైన్‌ నిర్మాణం ప్రస్తావన ఈ బడ్జెట్‌లో వస్తుందని అంతా ఆశించినా ఆ ప్రస్తావనే కనిపించకపోవడం గమనార్హం.
* సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైళ్లను ఆపేందుకు స్థలాభావం ఏర్పడటంతో కొన్ని రైళ్లను లింగంపల్లి, నాగుల పల్లి రైల్వేస్టేషన్ల వరకు తరలించి అక్కడ ఆపేస్తున్నారు.వీటిని శంకరపల్లి, వికారాబాద్‌, తాండూరు వరకూ పొడిగిస్తే నిత్యం హైదరాబాద్‌ వచ్చే దాదాపు 6వేల మంది ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.హైదరాబాద్‌నుంచీ తాండూరు వరకూ అనేక మంది ఉద్యోగులు నిత్యం రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు.ఉదయం..సాయంత్రం ఉన్న ప్యాసింజర్‌ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి.మహిళలకు కూడా కూర్చొనేందుకు స్థలం లభించదు.హైదరాబాద్‌ నుంచీ తాండూరు వరకూ..రానూ పోనూ కూడా నిలబడే ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.ఈ పరిస్థితుల్లో కొత్త రైళ్లు వస్తాయని బడ్జెట్‌ సందర్భంగా ఎదురు చూడటం, ఆ తరవాత నిరాశకు గురికావడం పరిపాటిగా మారింది..ఈసారి కూడా వీరందరికీ నిరాశే ఎదురైంది.
ఎంఎంటీఎస్‌కు మోక్షం లేదు..
ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణ పనుల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో కూడా రాకపోవడం గమనార్హం..రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఈ బడ్జెట్‌లో కనిపించకపోవడంతో వేల మంది పెట్టుకున్న ఆశలపై నీళ్లు చిలకరించినట్త్లెంది.వికారాబాద్‌ వరకూ పొడిగిస్తామని స్వయంగా రైల్వేశాఖ జీఎం గత ఏడాది ప్రకటించినా ఇందుకు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అలాగే భవనగిరి వరకూ కూడా ఈ ఎంఎంఎటీఎస్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనలు కూడా కేవలం మాటలేనని ఈ బడ్డెట్‌ తరవాత తేలిపోయింది.
'ఆదర్శ' స్టేషన్ల వూసే లేదు.
ఆదర్శరైల్వే స్టేషన్ల వూసే లేదు..గత ఏడాది శంకరపల్లి, వికారాబాద్‌,తాండూరు. లింగంపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చినా నిధులు చాలా మేరకు రాలేదు. ఫలితంగా పనులు జరగలేదు.తాండూరు, వికారాబాద్‌, లింగంపల్లి స్టేషన్లల్లో మౌలిక సదుపాయాలు కూడా కరువనే చెప్పాలి.రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలిపే సూచికలు సైతం పని చేయవు. మంచి నీళ్లు కూడా లభించే పరిస్థితి ఇక్కడ ఉండదని ప్రయాణికులు వాపోతున్నా కేంద్ర రైల్వే మంత్రికి కనికరం లేకుండా పోయింది. ఈ బడ్జెట్‌లో ఆయన ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ల అంశం ప్రస్తావించిన దాఖలాలు లేవు.
ఎక్స్‌ప్రెస్‌లు కొత్తగా ఆగేది లేదు.
జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా నిత్యం దాదాపు 250 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణిస్తుంటాయి.అయితే ఇందులో 50కి లోపు మాత్రమే రైళ్లు జిల్లాలోని స్టేషన్లల్లో ఆగుతున్నాయి.దీంతో కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎక్కేందుకు జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి రాజధానికి రావాల్సి ఉంటుంది.కోణార్క్‌, రాజ్‌కోట్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ముంబయి..నాందేడ్‌ వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వికారాబాద్‌లాంటి రైల్వే జంక్షన్లలో కనీసం రెండు నిమిషాలైనా ఆగేలా చూడాలన్న ప్రజల కోరిక ఈ రైల్వే బడ్జెట్‌లో కూడా నెరవేరలేదు.
జిల్లా హైదరాబాద్‌కు ఆనుకొనే ఉండటంతో హైదరాబాద్‌కు ప్రకటించే వరాలు కొంత మేర జిల్లా ప్రజలకూ ఉపయోగపడతాయి. ఈ సారి అలాంటి వూరట కూడా ఏమీ కనిపించకపోవడంతో జిల్లా ప్రజలు పూర్తిగా నిరాశకు గురయ్యారనే మాట వినిపిస్తోంది.

No comments:

Post a Comment