సికింద్రాబాద్‌లో ఆర్థిక నిర్వహణపై శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, సికింద్రాబాద్
నగరవాసులకు బన్సాల్ రైలు బండి అందకుండాపోయింది. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. రైల్వేలపరంగా ఎన్నో ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న హైదరాబాదీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. పాత ప్రకటనలను, హామీలను, ప్రతిపాదనలను, విన్నపాలను బుట్టదాఖలు చేశారు. పెద్దగా ప్రయోజనం లేని ఓ శిక్షణ సంస్థను మంజూరు చేసి పండుగ చేసుకోమన్నారు. తత్కాల్, ఏసీ రిజర్వేషన్ ఛార్జీలను భారీగా పెంచి పరోక్షంగా ముక్కుపిండారు. ఒక్క మాటలో చెప్పాలంటే నగరానికి సంబంధించి ఈ బడ్జెట్‌ను ఒక సర్వే... రెండు కొత్త రెళ్లు... మూడు పొడిగింపులుగా చెప్పుకోవచ్చు.
* శిక్షణ సంస్థ: రైల్వే అధికారులకు ఆర్థిక వ్యవహారాలపై శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్(ఐఆర్‌ఐఎఫ్‌ఎం)ను సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల కొంత మందికి ఉద్యోగాలు దక్కవచ్చని చెబుతున్నా ప్రయాణికులకు మాత్రం ఎలాంటి ప్రయోజనమూ లేదు. * డబ్లింగ్ సర్వే: సికింద్రాబాద్-ముద్కేడ్-ఆదిలాబాద్ మార్గంలో రెండో లైను వేసేందుకు డబ్లింగ్ సర్వే చేపడతారు. దీనిని 2013-14లో చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.
* కొత్త రైలు: కర్నూలు టౌన్- సికింద్రాబాద్ మధ్య ప్రతిరోజూ కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతారు. కాచిగూడ- మంగళూరు మధ్య కొత్త రైలును వారానికి ఒక రోజు నడపనున్నారు.
* వయా ఒకటి: చైన్నె- నాగర్‌సోల్( షిర్డీ సాయి) ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, డోన్, కాచిగూడ మీదుగా వారానికి ఒకసారి ప్రయాణించనుంది.
* మూడు పొడిగింపులు: గేజ్ మార్పిడి తర్వాత హైదరాబాద్-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను రేక్సెల్ వరకు పొడిగిస్తారు. హైదరాబాద్-బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు, ఫలక్‌నామా-భువనగిరి మెము రైలును వరంగల్ జిల్లా జనగామ వరకు పొడిగించారు.
* ప్రతిరోజూ: ఇప్పటివరకు వారానికి మూడు రోజులే నడిచిన సికింద్రాబాద్- మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ను ఇక ప్రతిరోజూ నడుపుతామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ నుంచి నాగర్‌సోల్(షిర్డీ సాయి)కు ఇప్పటివరకు సికింద్రాబాద్ మీదుగా వారానికి రెండు రోజులు నడవగా దానిని ఇక రోజూ నడపనున్నారు. పవిత్ర క్షేత్రం షిర్డీ వెళ్లేందుకు ఇది నగరవాసులకూ ప్రయోజనమే.
రెండో దశకు నిధులు!
నగరంలో నాలుగు మార్గాల్లో నిర్మించనున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం రూ.641 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండు వంతులు(66.5 శాతం) నిధులు భరించాలి. మిగతావి కేంద్రం మంజూరు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున జీహెచ్‌ఎంసీ తన బడ్జెట్‌లో రూ.190 కోట్లను కేటాయించింది. కేంద్రం గత ఏడాది రూ.99 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అందులో రూ.30 కోట్ల వరకు విడుదల కావొచ్చని చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాత్రం కచ్చితంగా ఎంత వస్తాయో చెప్పలేంగానీ...ఈసారి నిధులైతే విడుదలవుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2013-14లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
అందరితోపాటు కొంత
దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల్లో 1.52 లక్షలను రైల్వే నియామక మండలి(ఆర్‌ఆర్‌బీ)తో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం దక్షిణ మధ్య రైల్వేకు కనీసం 15 వేల పోస్టులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులోనే పరీక్ష నిర్వహిస్తుండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడనున్నారు. అయితే మంత్రి ప్రకటించినా అవన్నీ ఎన్నేళ్లల్లో భర్తీ చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
* ఎస్‌ఎంఎస్ ద్వారా రిజర్వేషన్ పరిస్థితిని తెలుసుకోవడం, ప్రధాన రైళ్లలో వై-ఫై సౌకర్యం కల్పించడం, ఈ-టిక్కెట్ విధానాన్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వర్ స్థాయిని పెంచుతామని ప్రకటించడం లాంటి చర్యలు ముఖ్యంగా నగర యువతను ఆకట్టుకునేవే.
No comments:
Post a Comment