(ఆంధ్రజ్యోతి- మే 01 2015) |
|
-భార్యకు ఇష్టంలేకున్నా బలవంతమా?
- దీనిని నేరంగా పరిగణించరా?
-సామాజిక కార్యకర్తల ప్రశ్న
-పార్లమెంటులో ప్రస్తావించిన కనిమొళి
- మరోమారు మొదలైన చర్చ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మూడు
ముడుల బంధం! ఇద్దరుగా మొదలయ్యే జీవితం! నాలుగు గోడల మధ్య సంసారం! భార్యకు
ఇష్టంలేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే... దానిని అత్యాచారంగా
భావించాలా? ఆ భర్తను దోషిగా పరిగణించి శిక్షించాలా? ఇప్పుడు ఈ అంశం రాజకీయ
నాయకులు, సీ్త్రవాదు లు, సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణుల మధ్య
చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో డీఎంకే సభ్యురాలు కనిమొళి ఈ అంశాన్ని
లేవనెత్తారు. ‘‘రేప్‌కు ఇచ్చిన నిర్వచనంలో సంసారిక అత్యాచారానికి ఇచ్చిన
మినహాయింపును తొలగించే ఆలోచన ఏమైనా ఉందా? మారిటల్ రేప్‌ను సైతం నేరంగా
పరిగణించాలని ఐక్యరాజ్యసమితి కమిటీ సిఫారసు చేయడం నిజమేనా?’’ అని కనిమొళి
ప్రశ్నించారు. ఇందుకు... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి బుధవారం
లిఖితపూర్వక సమాధానమిచ్చారు. భారత్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో
‘మారిటల్ రేప్’ను నేరంగా పరిగణించలేమన్నారు. ‘‘భారత్‌లో వివాహ
జీవితాన్ని పవిత్రమైన బంధంగా పరిగణిస్తారు. దీనిని పాశ్చాత్య కోణంలో
చూడలేం. సంసారిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం. ఈ విషయంలో ఐరాస కమిటీ
సూచనలు నిజమే అయినప్పటికీ, భారత లా కమిషన్ మాత్రం అలాంటి సిఫారసులు
చేయలేదు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి నేర శిక్షా స్మృతికి మార్పులు
చేసే ఆలోచన ఏదీ లేదు’’ అని హరిభా య్ చౌదరి తెలిపారు. దీంతో... ‘పెళ్లి’
అనే బంధాన్ని చూపించి ఇష్టమున్నా, లేకున్నా సెక్స్‌లో పాల్గొనాలని మహిళను
బలవంతపెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ‘‘వైవాహిక అత్యాచారాన్ని నేరంగా
పరిగణించాలి. కాలం చెల్లిన మన చట్టాలను మార్చాలి. ఈ విషయంలో పార్లమెంటు
సభ్యులంతా ఏకం కావాలి’’ అని కనిమొళి పేర్కొన్నారు. అంతేకాదు... మన దేశంలో
75 శాతం వివాహితలు ‘మారిటల్ రేప్’కు గురవుతున్నారని ఐరాస అంచనా వేసిందని
చెప్పారు. మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉండరాదని... వైవాహిక జీవితంలో
సెక్స్‌కూ ఇదే వ ర్తించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖా
సింగ్ పేర్కొన్నారు. కాగా ‘వైవాహిక అత్యాచారం’పై చర్చ జరగడం ఇదే మొదటిసారి
కాదు. అయితే... మన న్యాయ వ్యవస్థ ప్రకారం భార్యతో బలవంతపు సెక్స్ అనేది
నేరం కాదు. రేప్‌కు సంబంధించిన నిర్వచనంలో ‘మారిటల్ సెక్స్’ను
మినహాయించారు. దీనిపై ‘రిట్ ఫౌండేషన్’ న్యాయపోరాటం చేసింది. ఇక...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ ‘రైట్ ఆఫ్ ప్రైవసీ’
(తన ఇష్టప్రకారం ఒంటరిగా ఉండే హక్కు) కూడా ఉంది. బలవంతపు శృంగారమంటే ఈ
హక్కును హరించడమే అని వాదించింది. అయితే... ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు
కొట్టివేసింది. మహిళా సాధికారత, అభివృద్ధి గురించి పాలకులు ఎన్ని
చెబుతున్నా... ‘మారిటల్ రేప్’ విషయంలో మాత్రం భారత్ ఎంతో
వెనుకబడిపోయిందని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ‘మహిళపై
అత్యాచారం చేయడానికి పెళ్లి అనేది లైసెన్సా?’ అన్నది వీరి ప్రశ్న!
ఐపీసీ
375: ఏది అత్యాచారం, ఏది అత్యాచారం కాదు అనే నిర్వచనాలు ఈ సెక్షన్‌లో
పొందుపరిచారు. దీని ప్రకారం... 15 సంవత్సరాల వయసు పైబడిన భార్యతో బలవంతపు
శృంగారం రేప్ కాదు.
ఐపీసీ
376: అత్యాచార దోషులకు ఈ సెక్షన్ ప్రకారం శిక్షలు నిర్ణయిస్తారు. భార్యపై
‘అత్యాచారానికి’ పాల్పడినా శిక్ష వర్తించదని ఇందులో తెలిపారు. భార్య 12
సంవత్సరాలలోపు వయసున్న బాలిక అయితే మాత్రం ఆమెతో సెక్స్ నేరమే. ఇందుకు
కనీసం 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు.
ఐపీసీ
498 ఏ: గృహ హింస నుంచి మహిళలను రక్షించేందుకు ఉద్దేశించిన 498-ఏ సెక్షన్
కింద కూడా సంసారిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేదు. అయితే... ఇష్టంలేని
సెక్స్‌ను కారణంగా చూపి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా భార్య కోర్టును
ఆశ్రయించవచ్చు.
భర్త పిలిస్తే రావాల్సిందే!
మలేషియా మత గురువు ఫత్వా
ఒకవైపు
వైవాహిక అత్యాచారంపై భారత్‌లో చర్చ జరుగుతుండగానే... మరోవైపు మలేషియాకు
చెందిన మతగురువు పెరాక్ ముఫ్తీ హరుస్సనీ జకీరియా సంచలన ఫత్వా జారీ చేశారు.
‘‘భర్త ఎప్పుడు కోరుకున్నా భార్య సెక్స్‌కు అంగీకరించాల్సిందే. చివరికి...
వారిద్దరూ ఒంటె ఎక్కి ప్రయాణిస్తున్నప్పుడూ ఇది వర్తిస్తుంది’’ అని
తెలిపారు. ‘సంసారిక అత్యాచారం’ అనేది ఐరోపా దేశాలకు సంబంధించిందని
తేల్చేశారు. అనా రోగ్యం, బహిష్ఠు సమయం, బాలింతగా ఉన్నప్పుడు మాత్రమే భర్తతో
సెక్స్‌కు నిరాకరించే ‘హక్కు’ మహిళలకు ఉంటుందని ప్రవక్త చెప్పారని జకారియా
తెలిపారు. అంతేతప్ప... వైవాహిక బంధంలో అత్యాచారం అనే ప్రసక్తే ఉండదని
చెప్పారు.
No comments:
Post a Comment