అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, January 21, 2015

కథకులకు పాఠాలు చాసో కథలు

Posted on: Mon 19 Jan 06:
ఆ వీధిలో ఒక ఆరడుగుల పెద్దమనిషి, తెలుగు కథా ప్రపంచాన్ని ఏలిన కథక చక్రవర్తి తిరుగాడిన గొప్ప రచయిత వున్నాడని వారికి తెలియకపోవడమే కాదు, సినిమాలకు కథలు రాస్తారా అని వారడగటం... అది వాళ్ళ తప్పు కాదు, గొప్ప రచయితల్ని గుర్తించి, గౌరవించే సంస్కారం, అభిరుచి లేకపోయిన మనవాళ్ళ నిర్లక్ష్య ఫలితం.

చాసో పేరు చెప్పగానే 'ఎందుకు పారేస్తాను నాన్నా?' గుర్తుకొస్తుంది. ఆ తర్వాత 'ఏలూరెళ్ళాలి' తలపుకొస్తుంది. మిత్రుడు సైదాచారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'వాయులీనం' స్ఫురణకొస్తుంది. 'ఎంపు'లోని పరిమళ భరిత అక్షరాలు మానసాన్ని ఆక్రమిస్తాయి. క్యాంపస్‌లో వుండే రోజుల్లో చాసో గురించి రాజీవ్‌ పదేపదే మాట్లాడేవాడు. తర్వాత తను చాసోని కలిసి ఇంటర్వ్యూ చేశాడు. ఆ రోజుల్లోనే ఓపెన్‌ యూనివర్సిటీ వారి తెలుగు సిలబస్‌ పుస్తకాల్లో 'ఎందుకు పారేస్తాను నాన్నా' చదివిన గుర్తుంది. చదివిన మొదటిసారి చాలా థ్రిల్లయ్యాను. చదువుపై ఆ పిల్లాడి మమకారం, తపన బాల్యాన్ని తలపింపజేసింది.
ఇక 'ఏలూరెళ్ళాలి' ముగ్ధమనోహరమైన దీపకళిక. చాలాసార్లు చాలామంది మిత్రుల దగ్గర ఈ కథ గురించి మాట్లాడుకున్న రోజులున్నాయి. జీవితంలోని మహత్తునీ, వైచిత్రినీ, కథలోని సౌందర్యదీప్తినీ ఒక సంరంభమైన రీతిన మన రక్తనాళాల్లో మిళితం చేయగల సృజనాత్మక విన్యాసం 'ఏలూరెళ్ళాలి'. చాలాసార్లు చదివి పరవశించిన రోజులున్నాయి. అసలు ఆ కథ గుర్తుకొస్తేనే ఏదో మధురమైన జ్ఞాపకం హృదయాన్ని ఆవరించిన అనుభూతి కలుగుతుంది. ఒక దృశ్యాల పరంపర మన కళ్ళముందు ఆవిష్కృతమవుతుంది. అది నిజంగా జరిగిందనిపించే భ్రమకు లోను చేసే మహేంద్రజాలం ఏదో ఆ కథలో ఇమిడివుంది. కథల్లేవని సినిమావాళ్ళు వాపోతారు గానీ ఈ కథని సినిమాగా తీస్తే కెమెరా సృజించే అద్భుత దృశ్యకావ్యం కాదా? (వద్దులెండి! తెలుగు సినిమావాళ్ళ చేతిలో పడి ఈ కథ అందం చెడకపోతేనే మంచిది.) నచ్చిన పాటను మళ్ళీ మళ్ళీ విన్నట్టుగా ఈ కథను అప్పుడప్పుడు చదువుకోడమే హాయి.
ఒక్కటేమిటి చాసో రాసిన 'బొండుమల్లెలు, కుంకుడాకు, ఎంపు, చిన్నాజీ, వేలం వెంకడు, కుక్కుటేశ్వరం' వంటి కథలు వారి కథన ప్రతిభకు నిదర్శనం. తొలిరోజుల్లో కథ, కవిత్వం రెండూ రాసినప్పటికీ చివరకు కథాప్రక్రియలోనే తను చెప్పదలుచుకున్నది చెప్పారు. నిజానికి ఏదో చెప్పాలని, సందేశం ఇవ్వాలని చాసో కథలు రాశారంటే చాసోకు అపచారం చేసినట్టే. కథాప్రక్రియ పరిధి, పరిమితి, ప్రయోజనం తెలిసిన సృజనకారుడు చాసో. వచనాన్ని వాచ్యం చేయలేదు. తెలుగు వచనానికి ఒక వింత తేజస్సును అందించిన చాసో కథని చదివిన ప్రతిసారి ఓ విస్మయానికి లోనవుతాం.
అలాంటి చాసో కథలు చదివి, చాసో గురించి చెప్పిన మాటలు విని, చాసో ఇంటర్వ్యూలు చదివి చాసో అంటే అభిమానం పెంచుకున్నప్పటికీ చాసోని కలవలేదు. నిజానికి ''నీ అభిమాన రచయితను నువ్వు ఎప్పుడూ కలవకు'' అని ఎక్కడో చదివిన గుర్తు. అది అలా మెదడులో స్థిరపడిపోయింది. అయినా చాసోని కలవడానికి ప్రయత్నించిందీ ఎప్పుడూ లేదు. చాసో వెళ్ళిపోయాక చాలా కాలానికి ఒకసారి విజయనగరం వెళ్ళాను. గురజాడ నడయాడిన నేల అని తెలిసినప్పటికీ చాసో మీద ఇష్టమూ, మోహమూ కలగలసి ఆయన నివసించిన ఇంటిని, ఆయన తిరుగాడిన ప్రదేశాల్ని చూడాలనిపించింది.
విజయనగరంలో అడుగుపెట్టడం అదే తొలిసారి. మహామహులు తిరుగాడిన నేల, మహత్తర చరిత్రకు పట్టం గట్టిన నేల అని తెలుసు. అయినా మనసంతా చాసో మీదనే. అడ్రసు ముందే వుంది కాబట్టి ఆ వీధి దగ్గరికొచ్చాను. అక్కడ ఒక చిన్నషాపు వుంది. అందులో ఇద్దరు కూర్చున్నారు. 'చాసో గారి ఇల్లెక్కడీ' అని అడిగా.
'చాసో అంటే?' అని ఎదురు ప్రశ్న వేశారు. చాగంటి సోమయాజులు- పూర్తి పేరు చెప్పా. కథలు రాసేవారని అన్నా. ''సినిమాలకు కథలు రాస్తుంటారా?'' అని అడిగారు ఆ ఇద్దరు.
''హతవిధీ! అయ్యో చాసో'' అనుకున్నాను.
ఆ వీధిలో ఒక ఆరడుగుల పెద్దమనిషి, తెలుగు కథా ప్రపంచాన్ని ఏలిన కథక చక్రవర్తి తిరుగాడిన గొప్ప రచయిత వున్నాడని వారికి తెలియకపోవడమే కాదు, సినిమాలకు కథలు రాస్తారా అని వారడగటం... అది వాళ్ళ తప్పు కాదు, గొప్ప రచయితల్ని గుర్తించి, గౌరవించే సంస్కారం, అభిరుచి లేకపోయిన మనవాళ్ళ నిర్లక్ష్య ఫలితం.
'నెహ్రూనగర్‌, ఎల్‌బి నగర్‌, ఇందిరా కాలనీ' అని పేర్లు పెడుతుంటారు కానీ 'చాసో వీధి' అని పేరు పెట్టలేదు కదా. అలా పెట్టివుంటే, ఆ మనిషి గొప్పతనం గురించి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకునేవారు. తమ వీధిలో ఫలానా గొప్ప రచయిత వుండేవారని తరతరాలు స్మరించుకునేవి. శతజయంతి సందర్భంగా కూడా అక్కడ చాసో నివసించిన వీధికి 'చాసో వీధి' అని పేరు పెట్టినట్టు లేదు. కన్నడిగులో, బెంగాలీలో వాళ్ళ వీధులకు కవుల, రచయితల పేర్లు పెట్టుకున్నారని గొప్పగా చెప్పుకుంటాం. అదే పని మనం ఎందుకు చేయకూడదూ?
కర్నాటకలో వందేళ్ళ కిందట పుట్టిన కువెంపు పేరుతో కువెంపు యూనివర్సిటీనే అక్కడ స్థాపించారు. 'చాసో కథాపీఠం' 'చాసో కళామందిరం' అని గానీ ఆంధ్రా యూనివర్సిటీవాళ్ళయినా ఏర్పాటు చేయొచ్చు కదా! కువెంపు సాహిత్యం మీద ఈమధ్యనే తెలుగు యూనివర్సిటీలో రెండురోజులు సెమినార్‌ జరిగింది.
సరే, మరల చాసో దగ్గరికే వస్తాను. ఆ వీధిలో మరో నాలుగడుగులు వేసాక వేరేవాళ్ళు చాసో ఇంటిని చూపించారు. లోపల వాళ్ళ అబ్బాయి వున్నారు. సాదరంగా ఆహ్వానించారు. చాసో వున్నరోజులు గుర్తు చేసుకున్నారు. చాసో గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక గొప్ప కథకుడు నివసించిన ఇల్లు అది. ప్రతి అడుగు ఆయన స్పర్శతో పునీతమైంది. ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన కవులు, రచయితలు అక్కడికి వచ్చి గంటలు గంటలు గడిపిన సన్నివేశాలు ఎన్నెన్నో! రోణంకి అప్పలస్వామి, శ్రీరంగం నారాయణబాబు, పురిపండ అప్పలస్వామి గుర్తుకొచ్చారు. మహామహులు ఎందరో సంచరించిన ఆ ఇల్లు అప్పటికే కళావిహీనమై వుంది. ఆ ఇల్లు... ఆ పరిసరాలు తెలుగువారికి ఒక మ్యూజియంలా విలసిల్లాలి. కానీ ఏమిటిలా అనిపించింది.
మార్క్సిజాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, తెలుగు నాట పరిణామాల్ని గమనిస్తూ చాసో లోకాన్ని వీక్షించింది ఆ ఇంటి నుంచే. ఆ ఇల్లు అనామకంగా... గత వైభవపు జాడలయినా లేకుండా... చాసో ఇల్లుని చూసిన ముప్పిరిగొన్న అనుభూతి, మరోవైపున ఒక గొప్ప రచయిత జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకోలేని తెలుగువారి దురవస్థలోంచి వచ్చిన ఖేదం... మిశ్రమ అనుభూతులకు లోను చేసింది. ఆ తర్వాత అక్కణ్ణించి బయల్దేరి చాగంటి తులసి గారి ఇంటికి వెళ్ళి కలిసాను. అక్కడ వారి అమ్మగారిని చూసాను. చాసో గురించి మాట్లాడాను. నా మనసున తిరుగాడే ఆలోచనల్ని పంచుకున్నాను. చాసో పేరుతో ఒక అవార్డు పెట్టి ప్రతి ఏటా ఆయన జయంతి రోజున ఓ కథా రచయితని సత్కరిస్తున్నారామె. చాసోని ఇష్టంగా, ప్రేమగా గుర్తు చేసుకుంటున్న ఏకైక సందర్భమదే. (తర్వాత ఒకసారి పెద్దింటి అశోక్‌కుమార్‌కు చాసో అవార్డు ఇచ్చినప్పుడు ఆ సభలో పాల్గొన్నా.) కాని చాసో జ్ఞాపకాల్ని భద్రపరుచుకోడానికి ఇతరత్రా ఇతరులు చేసిందేమీ లేదు. ఇప్పుడు చాసో శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యాయి.
కథకునిగా చాసో అందించిన కంట్రిబ్యూషన్‌ ఎంతో విలువైంది. ప్రతి తరం పాఠకులు చదవదగ్గ కథలు సృజించిన ఆధునిక కథారచయిత చాసో. పరమ ఇష్టంగా చదివించే గొప్ప కథల్ని చాసో ఎలా రాశాడో తెలుసుకోవాలంటే చాసో కథల్ని ఒక పాఠ్యగ్రంథంలా అధ్యయనం చేయాలి. శైలి, శిల్పం, టెక్నిక్‌... ఏ పేరు పెట్టినప్పటికీ కథ చదవడం మొదలెట్టగానే మనల్ని వెంట తీసుకెళ్ళాలి. ఆపకుండా చదివించాలి. కథలో లీనం చేయాలి. చదివాక మనసున నిలిచిపోవాలి. వెంటాడాలి. ఆకస్మికంగా గుర్తుకురావాలి. అలాంటి కథలు రాసిన చాసోని కథకులు, కథలంటే ఇష్టపడేవారు తలచుకోకుండా ఉండలేరు. శ్రీశ్రీ కవిత్వాన్ని అపురూపంగా చదువుకున్నట్టు చాసో కథల్ని కూడా అంతే ఇష్టంగా మరల మరల చదువుకోవాలి. అలా చదవకుండా ఉండలేని ఉద్విగతకు లోను చేసే సౌందర్యం చాసో కథల్లోని రహస్యం.
- గుడిపాటి

No comments:

Post a Comment