అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, January 4, 2015

సైబర్‌ సమరం ముమ్మరం : భారత్‌ పారాహుషార్‌!



జేమ్స్‌బాండ్‌ సినిమా స్క్రిప్టును తలపించే సరికొత్త యుగంలోకి ప్రపంచం అడుగుపెడుతోంది. ఈ యుగంలో అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభుత్వాలకన్నా
మిన్నగా శక్తిమంతమైన ప్రభుత్వేతర సంస్థలు శాసిస్తాయి- కొత్త సహస్రాబ్దిపై బ్రిటిష్‌ దినపత్రిక ది టెలిగ్రాఫ్‌ అంచనా ఇది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) కార్యకలాపాలు ఈ పత్రిక పలుకులను అక్షర సత్యాలుగా నిరూపించాయి. ఐఎస్‌ తన సమరాన్ని వాస్తవ ప్రపంచంలోనే కాదు వాస్తవ సదృశ సైబర్‌ సీమలోకి విస్తరించింది. ఈ సంస్థ తరఫున ప్రచారం చేసిపెట్టే వీడియోలూ, సందేశాలూ, సమాచారాన్ని అందిస్తున్నందుకు 32 వెబ్‌సైట్లను భారత ప్రభుత్వం బ్లాక్‌చేసింది. వీటిలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు వినియోగించే గిట్‌ హబ్‌ కూడా ఉండటంతో ఐటి నిపుణులు గగ్గోలుపెట్టారు. వారి సమస్యను అర్థంచేసుకున్న ప్రభుత్వం చివరకు గిట్‌హబ్‌, వీమియో, డైలీ మోషన్‌, వీబ్లీ సైట్లపై మాత్రం నిరోధాన్ని తొలగించింది. ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందు అంతర్జాలంలో ఐఎస్‌ తరఫున ప్రచారం నిర్వహించినందుకు బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. 2014 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని బరైలీ జిల్లాలో సంభవించిన మతకలహాలకు హైదరాబాద్‌ నుంచి స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి) ఫేస్‌బుక్‌ ద్వారా పంపిన విద్వేషపూరిత సందేశాలే కారణమని భావిస్తున్నారు. అలాగే 2013లో ముజఫర్‌నగర్‌ అల్లర్లనుకూడా టెర్రరిస్టు గ్రూపులు సోషల్‌మీడియా ద్వారా మరింత రెచ్చగొట్టాయి. ఉగ్రవాదులకు సొంత మాల్‌వేర్‌
సౌదీ అరేబియా, ఖతార్‌, కువైట్‌, మరి ఇతర గల్ఫ్‌ రాజ్యాలు గుట్టుగా అందించిన నిధులతో ఆర్థికంగా బలోపేతమైన ఐఎస్‌ సంప్రదాయ ఆయుధాలతోపాటు సైబర్‌ అస్త్రాలనూ సమకూర్చుకొంటోంది. నిజ ప్రపంచంతోపాటు సైబర్‌ సీమలోనూ ఖలీఫా రాజ్యాన్ని విస్తరించాలని కలకంటోంది. జిహాదీల రిక్రూట్‌మెంట్‌ కోసమే కాదు, తన ప్రతాపాన్ని చాటుకోవడానికి శత్రువుల తలలు నరికివేసిన దృశ్యాల ప్రసారం కోసమూ సోషల్‌ మీడియాను ఉపయోగించుకొంటోంది. సైబర్‌ సమర సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి సొంతగా ఎన్క్రిప్టెడ్‌ (నిగూఢ) సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. దీని కోసం కోట్లాది డాలర్లను గుమ్మరిస్తోంది. సొంత సాఫ్ట్‌వేర్‌ చేతికి వచ్చేలోపు సైబర్‌ నల్లబజారు (డార్క్‌ వెబ్‌)లో మాల్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మెక్సికో విద్యుత్‌ గ్రిడ్‌పై సైబర్‌ దాడి జరిపి దాన్ని స్తంభింపచేసిన ఒక మాదక ద్రవ్య మాఫియా ముఠానుంచి సంబంధిత టెక్నాలజీని సంపాదించడానికి ఐఎస్‌ ప్రయత్నిస్తోంది. ఇదంతా బాండ్‌ సినిమాను తలపిస్తే ఆశ్చర్యమేముంది?
మరిన్ని దృష్టాంతాలు కావాలంటే... ఇటీవల అమెరికాలో సోనీ పిక్చర్స్‌ కంప్యూటర్లలోకి కొందరు హ్యాకర్లు చొరబడి సృష్టించిన విధ్వంసాన్ని చూడండి. ఉత్తర కొరియా ప్రభుత్వ పరోక్ష మద్దతుతో జరిగిందని భావిస్తున్న ఈ సైబర్‌ దాడివల్ల సోనీకి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై క్షిపణి దాడి జరిగి కిమ్‌ తల పేలిపోయినట్లు చూపే సినిమాను నిర్మించడమే సోనీ సంస్థ చేసిన నేరం. అమెరికాలోని 90శాతం వ్యాపార సంస్థల సైబర్‌ రక్షణ వలయాలను ఛేదించే శక్తి సోనీపై ప్రయోగించిన మాల్‌ వేర్‌కు ఉంది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, బొలీవియా దేశాలలోని సర్వర్ల గుండా ఈ మాల్‌ వేర్‌ను ప్రయోగించారు. మాల్‌వేర్‌ను సోనీపైకి వదలిన కంప్యూటర్లను దెబ్బతీసే శక్తి అమెరికాకు ఉన్నా, ఆ ఎదురుదాడిలో తమ మిత్రదేశాల సైబర్‌ వ్యవస్థలూ నాశనమవుతాయి. ఇది అమెరికా చేతులను కట్టేసింది. ప్రపంచంలో అత్యంత నిరుపేద దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియా, ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాకే చెక్‌ పెట్టడం చూస్తే, సైబర్‌ యుద్ధం ధాటి ఏమిటో తెలుస్తుంది. సోనీపై దాడి తమ పనికాదని ఉత్తర కొరియా బుకాయించినా, ప్రభుత్వాల అండతో ప్రభుత్వేతర వ్యక్తులు, సంస్థలు ఎలా చెలరేగిపోవచ్చో ఈ ఉదంతం చాటిచెప్పింది. అంతర్జాలంలో జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు చెరిగిపోతాయి కనుకనే ఇంటర్నెట్‌పై ఉగ్రవాదుల, జిహాదీల కన్ను పడింది.
అంతర్జాలంలో తిమ్మిని బమ్మి చేయవచ్చు. ఉన్నదాన్ని లేనిదిగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపవచ్చు. 2012లో మయన్మార్‌లోని రాఖీన్‌ రాష్ట్రంలో 26 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య జరిగింది. దీన్ని పురస్కరించుకొని జూన్‌ 3వ తేదీన జరిగిన అల్లర్లలో 80మంది చనిపోయారు. 80,000 మంది నిర్వాసితులయ్యారు. మయన్మార్‌ ఘటనతో సంబంధం లేకపోయినా జులై 20వ తేదీన అసోంలో అల్లర్లు విరుచుకుపడినాయి. దీనిపట్ల పాకిస్థాన్‌, ఇరాన్‌ తదితర ఇస్లామిక్‌ దేశాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇస్లామిక్‌ ప్రపంచంలో ప్రతీకారాన్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన విద్వేషపూరిత సందేశాలు అంతర్జాలంలో దర్శనమివ్వసాగాయి. వాటి పర్యవసానంగా 2012 ఆగస్టు 14వ తేదీన పుణెలో ఈశాన్య భారతీయులపై దాడులు జరిగాయి. ఆగస్టు 14న మైసూరులో ఒక టిబెటన్‌ యువకుడిని కత్తితో పొడిచారు. దీనికితోడు ఎస్‌ఎంఎస్‌లు, సోషల్‌ మీడియా ద్వారా విద్వేషం నూరిపోసే సందేశాలు వ్యాపించసాగాయి. ఫలితంగా ఈశాన్య భారతీయులు పెద్దయెత్తున బెంగళూరును వదలివెళ్లిపోయారు. ప్రభుత్వం రంగంలోకి దిగి ఎస్‌ఎంఎస్‌ల సంఖ్యను రోజుకు అయిదుకు పరిమితం చేయడంతోపాటు కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసింది. ఆ సైట్లలోచూసినవి మయన్మార్‌ ఘటనలే తప్ప అస్సాం ఘటనలు కావు. అయినా అసలు సంగతిని వక్రీకరిస్తూ, భారతదేశంపై విద్వేషం నూరిపోసే సందేశాలు, వీడియోలు పశ్చిమాసియాలోని ఐపి చిరునామాల నుంచి విస్తృతంగా ప్రసారమయ్యాయి.
అంతర్జాలం ద్వారా ఈ విధమైన సమాచార మార్పిడి మహావేగంగా జరుగుతోంది. 1998లో ప్రపంచంలో కేవలం 12 ఉగ్రవాద సంబంధ వెబ్‌సైట్లు ఉండగా, నేడు వాటి సంఖ్య 10,000కు పెరిగింది. సోషల్‌ మీడియా, ఫోరమ్స్‌, చాట్‌ రూమ్స్‌ సహాయంతో టెర్రరిస్టు యంత్రాంగాలు వ్యాపిస్తున్నాయి. అమెరికా, తదితర దేశాల నుంచి ఉగ్రవాదులను రిక్రూట్‌ చేసుకోవడానికి ఇన్‌స్పైర్‌ అనే శీర్షికతో ఆన్‌లైన్‌ ఆంగ్ల పత్రికను కూడా నడుపుతున్నారు. వెబ్‌ సైట్లకు సందర్శకులు తమకుతాముగా రావాలి. అదే సోషల్‌ మీడియాలోనైతే ఉగ్రవాదులు నేరుగా యువతరంతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవచ్చు. శత్రువుల తల నరికే దృశ్యాలు, బలవంతపు అపహరణల వీడియోలను ఉగ్రవాదులు యూట్యూట్‌లో సునాయాసంగా అప్‌ లోడ్‌ చేస్తున్నారు. కీన్యాలోని వెస్ట్‌ గేట్‌ షాపింగ్‌ మాల్‌ మీద దాడి జరిపినప్పుడు ఉగ్రవాదులు తమ అఘాయిత్యాన్ని ట్విటర్‌లో ఎప్పటికప్పుడు ప్రసారం చేశారు. బాహ్య ప్రపంచంలో విద్రోహుల ఆట కట్టించడానికి కర్ఫ్యూ విధించినట్లు, అంతర్జాలంలో విధించడం కుదరదు. సైబర్‌ సీమలో ఒక యుఆర్‌ఎల్‌ను బ్లాక్‌ చేస్తే, అందులోని విద్వేషపూరిత, తిరుగుబాటుదారీ వీడియోలు, సందేశాల ప్రతులు వేలాది ఇతర సైట్లలో ప్రత్యక్షమవుతాయి. కాబట్టి సైబర్‌ యంత్రాంగాలను బ్లాక్‌ చేయడంతోపాటు సమాచార పంపిణీనీ సెన్సార్‌ చేయాలని చైనా నిశ్చయించింది. తియానన్మెన్‌ చౌకీ నిరసన ప్రదర్శనల సమాచారం అంతర్జాల న్యూస్‌ గ్రూపుల ద్వారా, ఫాక్సిమైల్‌ యంత్రాలు, ఆడియోటేపుల ద్వారా ప్రపంచమంతా ప్రసారమవడంతో చైనా, సైబర్‌ నెట్‌వర్క్‌లతో పాటు వాటి ద్వారా పంపిణీ అయ్యే సమాచారాన్నీ నియంత్రించి జాతీయ భద్రతను సంరక్షించుకోవాలని తీర్మానించింది. ఇలాంటి కరకు నిర్ణయాన్ని భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశం తీసుకోలేదు. అయితే, సైబర్‌ భద్రత గురించి చైనా నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.
వేలాది నిపుణులు అవసరం
ఉదాహరణకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటి)లో అగ్రరాజ్యమైన భారత్‌లో కేవలం 556మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఉంటే చైనాలో 1.25 లక్షల మంది, అమెరికాలో 91,080మంది, రష్యాలో 7,300మందీ ఉన్నారు. భారతీయ వెబ్‌ సైట్ల మీద చైనా, పాకిస్థాన్‌, అమెరికా, ఐరోపా, బ్రెజిల్‌, టర్కీ, బంగ్లాదేశ్‌, అల్జీరియా, యుఏఇ దేశాలలోని సర్వర్ల ద్వారా జరుగుతున్న సైబర్‌ దాడులను ఎదుర్కోవాలంటే మరింతమంది సెక్యూరిటీ నిపుణులు కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 4,446మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది. ఐటీలోని వివిధ రంగాల్లో అయిదు లక్షల మంది సైబర్‌ నిపుణులను తయారుచేయాలని జాతీయ సైబర్‌ భద్రతా విధానం తీర్మానించింది. సైబర్‌ భద్రత దిశలో సర్కారు ఎంత త్వరగా ముందడుగేస్తే దేశానికి అంత మేలు!
- వరప్రసాద్‌
ఈనాడు సౌజన్యంతో...

No comments:

Post a Comment