Sakshi | Updated: December 25, 2014
తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో
ఇతమిద్ధంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ... 16వ శతాబ్దం తొలినాళ్లలో
పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి ఏసు క్రీస్త్రు
పరిచయమయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం.
1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ
మతంపై గట్టి నమ్మకం కలగజేశాయని ఓ వాదన. 1800 నాటికి గోల్కొండ రాజ్యంలో
చర్చిల ఏర్పాటు జరిగిందని క్రైస్తవ మత ప్రచారకుడు వికార్ అపోస్టోలిక్ ఒక
నివేదికలో పేర్కొన్నారు. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్‌లో ఇస్లాంతో పాటు
హిందూ, క్రైస్తవ మతాలు కూడా తగిన ప్రాభవాన్ని పొందాయి. సర్వమతాల సమ్మేళనంగా
భాగ్యనగరం భాసిల్లింది. నిజాం ప్రభువులు ఆనాటి క్రైస్తవ మత చర్చిలకు పెద్ద
సైజు గడియారాలు, గంటలు, ప్రార్థన మందిరంలో వాడేందుకు వీలుగా రంగూన్ టేకుతో
తయారు చేయించిన పొడవాటి టేబుళ్లు, కుర్చీలు మరెన్నో ఇతర అలంకరణ వస్తువులు
ఉదారంగా అందజేసారని, తద్వారా తమ పరమత సహనాన్ని చాటి చెప్పారని
చరిత్రకారుల అభిప్రాయం.
తొలినాళ్లలో క్రైస్తవ చర్చిల ఏర్పాటు సికింద్రాబాద్ ప్రాంతానికే
పరిమితమైంది. ఆ దరిమిలా కోఠిలో బ్రిటిష్ రెసిడెన్సీ ఏర్పాటుతో చాదర్‌ఘాట్-
అబిడ్స్ పరిసరాలలో క్రైస్తవ కుటుంబాలు స్థిరపడటంతో ప్రత్యేకంగా సెయింట్
జార్జి చర్చి (అబిడ్స్) నిర్మించారు.
ఈ పురాతన చర్చిల నిర్మాణ శైలిలో యూరోపియన్ వాస్తు శిల్ప శైలి స్పష్టంగా
కనబడుతుంది. ఆధునిక యంత్ర సామగ్రి అందుబాటులో లేని రోజుల్లో, కేవలం సున్నం,
ఇసుక మిశ్రమంతో నిర్మించిన ఈ ఎత్తై కట్టడాలు పురాతన సాంప్రదాయ నిర్మాణ
పటిమకు దర్పణం.
సెయింట్ జోసఫ్ కేథడ్రల్ చర్చి1870 గన్‌ఫౌండ్రీ

ఎత్తై
రాతి కొండలాంటి ప్రదేశంలో సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి గన్‌ఫౌండ్రీ
సమీపంలో నిర్మించారు. క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించే శిలువ ఆకారంలో దీని
నిర్మాణం జరిగింది. ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా... అన్నట్లు రెండు ఎత్తై
శిఖరాలు చర్చి ముందర భాగం నుంచి చూస్తే కనిపిస్తాయి. నిజాం కాలంలో నవాబ్
అస్మాన్ జా సహకారంతో అప్పటి క్రైస్తవ మత పెద్ద డోమినిక్ బార్‌బెరో
ఆధ్వర్యంలో దీని నిర్మాణం చేపట్టారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని కొత్త
బస్తీగా పిలిచేవారు. మత పెద్ద పీటర్ కప్రోటీ నేతృత్వంలో ఈ చర్చికి
శంకుస్థాపన జరిగింది. ఫాదర్ ఎల్.మల్‌బెర్టీ 1872లో స్థానిక క్రైస్తవుల
సహాయంతో చర్చి ప్రధాన భవనాలను పూర్తిచేసి 1875లో క్రిస్మస్ పండుగ నాడు
ప్రారంభించారు. 1892లో ఇటలీ నుంచి తెప్పించిన అతిపెద్ద సైజు గంటలు ఇక్కడ
ఏర్పాటు చేశారు. ఇక్కడ గంట కొడితే సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ దాకా
వినబడేదట. చర్చిలో అనేక రంగు రంగుల పెయింటింగ్స్ ఇటలీ నుంచి తెప్పించారు.
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తరచూ ఈ చర్చికి వచ్చేవారని, ఇక్కడ
ఉన్న టవర్‌లలో అమర్చిన గోడ గడియారాన్ని, అపురూపమైన తైలవర్ణ చిత్రాలు, పెద్ద
టేబుల్స్, ఇతర ఫర్నిచర్ నిజాం నవాబు ఉదారంగా అందజేశారని స్థానిక చర్చి
పెద్దలు తెలిపారు.
హోలీ ట్రినిటీ చర్చి 1847 బొల్లారం

బొల్లారం
ఆర్మీ ఏరియాలో ఉన్న ఈ చర్చి నిర్మాణం 1847లో జరిగింది. బ్రిటిష్ ఆర్మీ
అధికారుల కోసం దీన్ని నిర్మించారు. ఇందుకు తగిన భూమిని ఆనాటి నిజాం
నజారానాగా ఇచ్చారు. చర్చి నిర్మాణానికి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా
నిధులు సమాకూర్చారు. ఇంతటి విశిష్టత గల 167 సంవత్సరాల వారసత్వపు కట్టడంలో..
1983 నవంబరు 20న తన భర్త ఫిలిప్స్‌తో కలిసి హైదరాబాద్ విచ్చేసిన బ్రిటిష్
యువరాణి ఎలిజెబత్ తన పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంది. రెవరెండ్
బి.పి.సుగంధర్, రెవరెండ్ ప్రభాకర్, ఆనాటి పాస్టర్ జి.జె.హామిల్టస్ ఈ
వేడుకలు నిర్వహించారు. కొన్ని తరాలుగా బ్రిటిష్ రాణి వాసంతో సంబంధం ఉన్న ఈ
చర్చి రంగుటద్దాలపై గీసిన ఏసు ప్రభువు చిత్రాలు నేటికీ చెక్కు చెదరలేదు.
అలాగే చర్చిలో అనాదిగా సాంప్రదాయబద్దంగా వాడుతున్న పలు పరికరాలు, ముఖ్యంగా
అతి పెద్ద ఎలక్ట్రిక్ హార్మోనియం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది 25 అడుగుల
పొడువు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది.
సెయింట్ జాన్ చర్చి 1813 మారేడుపల్లి

నగరంలోని
అతి పురాతన చర్చిల్లో సెయింట్ జాన్ చర్చి ప్రధానమైంది. సికింద్రాబాద్‌లోని
ఈస్ట్ మారేడుపల్లిలో సెయింట్ ఆన్స్ స్కూలుకు సమీపంలో ఉంది. సెయింట్ జాన్
ది బాప్టిస్టు పేరు మీద 1813లో ఈ చర్చి పనులకు శ్రీకారం చుట్టినట్లు
చారిత్రక ఆధారాలున్నాయి. ఇది మెదక్ డయాసిస్ పరిధిలో పనిచేస్తుంది. బ్రిటిష్
కాలంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటున్న సైనికాధికారులు తమ కోసం
ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలంలో చర్చి పెద్దలకు కూడా
మిలిటరీ మేజర్ హోదా ఉండేదని, అర్ధ శతాబ్దికి పైగా ఈ చర్చితో అనుబంధం గల
స్థానిక క్రైస్తవ పెద్ద తెలిపారు. ఆ రోజుల్లో చర్చి పెద్దలను లండన్ నుంచి
ప్రత్యేకంగా నియమించేవారు. చాలా కాలం కంటోన్మెంట్‌లో ఉంటున్న బ్రిటిష్
సైనికాధికారులకు మాత్రమే ఈ చర్చిలో ప్రవేశం ఉండేది. సైనికాధికారుల తుపాకులు
ఇతరత్రా ప్రార్ధనా మందిరానికి దగ్గరలో భద్ర పరుచుకోవడానికి వీలుగా ఆనాడు
చర్చిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటికీ దీన్ని చూడవచ్చు. ఈ చర్చి భవన
నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని నాటి దీవాన్ బహదూర్ సేఠ్‌రామ్‌గోపాల్
ఆర్థిక సహాయం అందించారు. తరచూ చర్చికి వచ్చి పోతుండేవారు. చర్చి ప్రాంగణంలో
ఈ మేరకు శిలాఫలక ఆధారాలున్నాయి. చర్చిని శిలువ ఆకారంలో నిర్మించారు.
సుమారు 150 సంవత్సరాలు పైబడినా, చర్చిలో ఉన్న రంగూన్ టేకుతో చేసిన పొడవాటి
బెంచీలు ఇతర ఫర్నిచర్ చెక్కు చెదరలేదు. 1918లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాన్లు
ఏర్పాటు చేశారు. ఈ చర్చికి 1998 -99లో హుడా -ఇంటాక్ సంస్థలు హెరిటేజ్
అవార్డులు ప్రకటించాయి.
ఆల్ సెయింట్స్ చర్చి 1860 తిరుమలగిరి

తిరుమలగిరిలో
ఉన్న ఈ చర్చిని గోతిక్ శైలిలో 1860లో నిర్మించారు. ఈ ప్రాంతంలో ఏర్పడిన
తొలి క్రైస్తవ ప్రార్థనా మందిరం ఇదే. మెదక్ చర్చిలో మాదిరి రంగుటద్దాలపై
శిలువ వేసిన ఏసు ప్రభువు ఇక్కడ దర్శనమిస్తాడు. విశేషమేమంటే... శతాబ్దకాలం
పైబడుతున్నా ఈ రంగుటద్దాలపై చిత్రించిన చిత్రాలు చెక్కుచెదరలేదు. ఈ చర్చిలో
అనాదిగా ప్రార్థనా సమయంలో వాడుతున్న పలు పరికరాలు నేటికీ ఆకర్షణీయంగా
కనిపిస్తున్నాయి. వందేళ్లు పైబడిన ఈ చారిత్రక చర్చి... నేటి తరానికి
అందజేసే వారసత్వపు గుర్తులు అనేకం ఉన్నాయనిపిస్తుంది. 1983లో బ్రిటిష్
రాణి ఎలిజెబత్ ఆల్ సెయింట్ చర్చిని సందర్శించారు.
సెయింట్ మేరీస్ చర్చి 1839 సికింద్రాబాద్

ఈ
చర్చిని సెయింట్ మేరిస్ కేథడ్రల్ అనేవారు. 1500-1832 మధ్య కాలంలో
హైదరాబాద్ డయాసిస్‌ను వికారియట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలిచేవారు. 1839
ప్రాంతంలో ఫాదర్ డానియల్ మర్ఫీని సికింద్రాబాద్ ప్రాంతంలో క్రైస్తవుల
కోసమని ఒక చర్చి నిర్మించాలని ప్రత్యేకంగా లండన్ నుంచి పిలిపించారని
క్రైస్తవ ప్రముఖులు తెలిపారు. ఫాదర్ మర్ఫీ తగిన స్థలాన్వేషణ చేసి, 1840
ప్రాంతంలో చర్చి పనులకు శ్రీకారం చుట్టి, సుమారు పదేళ్ల కాలం (1850)లో
నిర్మాణం పూర్తి చేసినట్టు ఆధారాలున్నాయి. గోతిక్ సంస్కృతిలో దీన్ని
నిర్మించారు. పొడవాటి టేకు టేబుళ్లతో విశాలమైన ప్రార్థనా మందిరంలో 500 మంది
ఇందులో ఒకేసారి ప్రార్థన చేసుకునే వీలుంది. ఈ చర్చి పరిధిలో పలు పాఠశాలలు,
కళాశాలలు నిర్వహిస్తూ ఎందరికో విద్యావకాశాలు కల్పిస్తున్నారు.
సెయింట్ జార్జి చర్చి 1865 అబిడ్స్

కోఠిలో
బ్రిటిష్ రెసిడెన్సీ ఏర్పాటు చేయడంతో ఆ పరిసరాలలో ముఖ్యంగా చాదర్‌ఘాట్ -
అబిడ్స్‌ల మధ్య క్రైస్తవ మత కుటుంబీకులు అధికంగా స్థిరపడ్డారు. వీరందరి
కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభువు అనుమతితో పదిన్నర ఎకరాల విస్తీర్ణంలో
సెయింట్‌జార్జి చర్చికి శ్రీకారం చుట్టారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంటు సర్
జార్జి యాలే 1865లో ఈ చర్చికి శంకుస్థాపన చేశారు. రెండేళ్ల (1867)లో
నిర్మాణం పూర్తి చేశారు. విశిష్ట యూరోపియన్ శైలిలో ఈ చర్చి నిర్మాణం
జరిగింది. ప్రాంగణమంతా చల్లని నీడనిచ్చే చెట్లతో నిండి ఉంది. డెబ్బై అడుగుల
ఎత్తులో క్రీస్తు శిలువ ఆకారంలో చర్చి నిర్మాణం జరిగింది. చర్చి ముందు
ఎత్తై పోర్టికో, ప్రార్థనా మందిరంలో రంగూన్ టేకు టేబుళ్లు, ఇతర ఫర్నిచర్
నేటికీ చెక్కుచెదర లేదు. రంగుటద్దాలపై ఏసుక్రీస్తు జీవిత విశేష ఘట్టాలు,
శాంతి సందేశాలతో చిత్రించిన గ్లాసు పెయింటింగులు, ఇతర కుడ్య చిత్రాలు,
పుష్ప కళాకృతులు ఆకట్టుకుంటాయి. ఈ చర్చికి ఆరో నిజాం ఇతోధికంగా నజరానాలు
అందజేశారు. అలాగే చర్చిలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గడియారం, గంటలు నిజాం
నవాబు ఇచ్చినవే. మిరిమిట్లు గొలిపే లోహపు కాంతితో ఆకాశంలోకి ఎగరడానికి
విప్పుకున్న రెక్కలు మాదిరిగా ఏర్పాటు చేసిన ఇక్కడి బైబిల్ రీడింగ్ స్టాండ్
ప్రత్యేక ఆకర్షణ.
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com
No comments:
Post a Comment