అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, December 25, 2014

శాంతి సంబరం

    
     శాంతి, ప్రేమ, కరుణ రూపమే జీసస్‌. ఆదరణ, అభిమానం... సామరస్యం, సౌభ్రాతృత్వాల గడ్డ మన దేశం. అలాంటి దేశంలో ఏసుప్రభువు స్మరణతో జనం తరిస్తున్నది. మిన్నంటుతున్న ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ సంబరాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల్లా జీవన గమనంలో అందరికీ నవోదయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఏసుకు మరో పేరు కాపరి. గొర్రెల పాకలో జన్మించాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిలు చదవాల్సిందే.కొత్త పాత నిబంధనలతో 66 పుస్తకములు కలిపితే బైబిల్‌. ఆ బైబిల్‌ను ఏసు సహచరులు, ప్రేరకులు మాత్రమే రాశారు. ఏసు ప్రభువు రోమన్‌ చక్రవర్తులకు, దుర్మార్గులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేయడం కోసం, ప్రజలను వారి బారి నుండి రక్షించడం కోసం రోమన్‌ సామ్రాజ్యం అంతా తిరిగాడు. మనుష్యులున్న ప్రతి చోటుకు చేరుకున్నాడు. చెట్టు, పుట్ట, చేను, చెలక, పశువులు, పక్షులతో కూడా స్నేహం చేశాడు. ప్రేమను పంచాడు. ఏసు అంటే ప్రజలకు భరోసా. మా ప్రభువు, మా ధైర్యం అనుకునేంతగా ప్రజలతో మమేకమయ్యాడు. మనకు రాజులేడు.. రాజ్యము లేదు.. నేను రాజును... నా మార్గం విముక్తి మార్గం. నేను చెప్పేది సత్యం, ధైర్యంగా ఉండండి. అని పీడిత ప్రజలకు ఆత్మస్థయిర్యాన్ని అందించాడు. తలదించుకున్న జనాలను నిటారుగా నిలబెట్టాడు. సొంత కాళ్ళపై నిలబడాలన్నాడు. ప్రజలందరు ఒక్కటేనని బోధించాడు. ప్రజల మధ్య హెచ్చుతగ్గులు వద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన ప్రత్యక్ష కార్యశీలి. కుష్టురోగుల వద్దకు వెళ్లాడు. పుండ్లు, చీము, నెత్తురు ముసురుతున్న ఈగల మధ్య బతికే వారి గాయాలు కడిగి మలాం పూశాడు. మంచి మాటలు చెప్పాడు. అన్నం పెట్టి అక్కున చేర్చుకున్నాడు. పేదలే నా పెన్నిధి అని చేతగాని వారికి చేయూతనిచ్చాడు. దానితో ఆయనకు జనం జేజేలు పలికారు. జనం ఆయన వెంట నడిచారు. రోమన్‌ చక్రవర్తులు ఏసును చంపాలని ఆజ్ఞాపించారు. ఏసు ఎక్కడున్నాడో తెలియదు. ఏసు ఎవరు? ఎక్కడున్నాడు? అంటే అక్కడి ప్రజలు 'నేనే, నేనే' అని దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు. వారి చైతన్యానికి విస్తుపోయిన పాలకులు పన్నెండు మంది శిష్యులలో బలహీనమైన శిష్యుడిని మచ్చిక చేసుకొని ఏసును చంపేందుకు కుట్ర చేశారు. అతి దారుణంగా, బహిరంగంగా చిత్రహింసలు పెట్టారు. ఇలా ఏసు జీవితాన్ని, చరిత్రను ఆయన పుట్టిన రోజున నెమరువేసుకుంటే.... మార్క్సిజానికి, క్రిస్టియనిజానికి దగ్గర సంబంధం కనిపిస్తుంది. ఏసు రాచరికానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఎట్లా ప్రజలలో పనిచేశాడో. ఊరూరూ, దేశదేశాలు తిరిగి ప్రజలను చైతన్యపరిచాడో, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా గత 60 ఏళ్ళుగా ప్రజలలో ఉన్నారు. పేదల కోసం, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా... ప్రపంచ పీడిత ప్రజల విముక్తికి మార్గం చూపిన మహోపాధ్యాయులలో ఒకరైన ఏంగెల్స్‌ క్రైస్తవ మతాన్ని గురించి ఇలా అన్నారు. 'తొలి నాటి క్రైస్తవ మతం శ్రామిక ప్రజల ఉద్యమంతో అనేక విధాల పోలికలు కలిగి ఉంటుంది. క్రైస్తవం వాస్తవంగా అణగారిన పీడిత ప్రజల ఉద్యమంగా మారింది. అది బానిసత్వం నుండి విముక్తి పొంది బానిసల కొరకు పోరాడేదిగా ఉద్భవించింది. హక్కులు లేని పేదల కోసం రోమన్‌లచే అణచివేయబడి హక్కులు కోల్పోయిన ప్రజల కోసం క్రైస్తవ మతం పుట్టింది. క్రైస్తవ మతం, సోషలిజం కూడా బానిసత్వం నుండి బాధల నుండి విముక్తినే ప్రబోధిస్తాయి. క్రైస్తవం మరణానంతరం విముక్తి అంటుంది. సోషలిజం ఈ ప్రపంచంలోనే విముక్తి సాధించాలంటుంది. సమాజాన్ని సమూలంగా మార్చాలంటుంది.
ప్రజలు అనుభవించినదంతా, ఆచరించినదంతా
ఈ భూమి మీదే జరిగితే సత్యం. అదే ఆచరణకు యోగ్యం.
         'నేను మీకు ఈ భూమిని ఇచ్చాను. ఇది మీకే చెందుతుంది. ఇది మీ కుటుంబాలకు వారతసత్వమవుగాక... భూమిలో పంట పండుతుంది. మీరు హాయిగా తిని భద్రంగా జీవించండి' అని వాక్యం చెప్పింది. ప్రభువు చెప్పినట్లుగా... భూమితో మనిషికున్న బంధం తల్లిబిడ్డల పేగు బంధం. ఉమ్మడి ఆస్తి నుండి వ్యక్తిగత ఆస్తిగా... భూమి మారడం, తదుపరి కార్పొరేట్‌ శక్తుల పరం కావడం. అనేక పంటలుపండే అందమైన సుక్షేత్రమైన భూమి రియల్‌ ఎస్టేట్‌. ధనవంతులకు స్వాధీనం కావడం ఇదీ నేడు జరుగుతున్న పచ్చినిజం.
'పేదలను దోచుకుంటున్నారు గనుక ఆప్తులు అలమటిస్తున్నారు' అని ప్రభువే ప్రకటించాడు. పేదలకున్నది సాధించే వరకు రక్షణ కల్పిస్తానని చెప్పియున్నాడు. అంతేకాదు దోచుకునే వారి గురించి బైబిల్‌ ఇలా హెచ్చరించింది : 'వారు భారీగా, నాజూకుగా తయారయ్యారు. హద్దూ పద్దూలేని దుర్మార్గాలు చేస్తున్నారు' వారు అనాథలను న్యాయంగా చూడరు. వారిని పైకి తేవాలనుకోరు. ఆర్తుల హక్కుల కోసం నిలబడరు. ఇలాంటి దురార్గుల నుండి భూమిని కాపాడి ప్రజల పరం చేయాలి. అప్పుడే బడుగు బతుకులకు విముక్తి. అప్పుడే ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకుంటారు.
             భూ పోరాటాలపై 'పోప్‌' మాటలు తలచుకుందామా! 'భూమిని సాధించడానికి సాగే పొరాటాలకు ఏసుక్రీస్తు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి' అని ఆయన దీవించారు.
పాలకులు, కార్పొరేట్‌ కంపెనీలు కలిసి సాగు భూమి నుంచి, నివాస స్థలాల నుంచి ప్రజలను తొలగించి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. భూమి అందరికి చెందటమే క్రైస్తవ సిద్ధాంతం. పేదలు అన్యాయానికి తలవంచవద్దు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. క్రైస్తవ సమాజం వారికి అండగా నిలవాలి. సంఘీభావం ప్రకటించాలి. నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలు సమస్త వ్యవస్థాగతమైన వాటికి వ్యతిరేకంగా పోరాడాలని స్వయంగా పోప్‌ పిలుపునిచ్చారు. దేశదేశాల్లో జరిగిన భూ పోరాటాలకు, పేదలకు మత ఫాదర్లు, పాస్టర్లు అండగా నిలబడ్డారు. చర్చిలు వారికి తోడుగా నిలిచాయి. ప్రజల కష్టాలు, కన్నీళ్లకు, ఆకలికి, దారిద్య్రానికి కారకులైన యజమానులపై, దోపిడిదారులపై, పాలకులపై పోరాడాలని చాలా స్పష్టంగా ప్రభువు పేర్కొన్నాడు. అంతేకాదు 'కేవలం నా మాటలు మాత్రమే విని ఏ పనీ చేయని వాడు పునాది లేకుండా ఇల్లు కట్టిన వాడులాగా ఉంటాడు' అని చెప్పాడు. ఆచరణ లేని బోధనలు వ్యర్థం, బోధనలు లేని ఆచరణలు నిరుపయోగం అని మనకు బోధపడుతుంది.
ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ, భూ పోరాటాలకు సంసిద్ధులం అవుతూ, ఏసు ప్రవచనాలు మరోసారి ఈ సందర్భంగా మననం చేసుకుందాం. ఆచరణకై అడుగులు వేద్దాం.

No comments:

Post a Comment