అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, October 18, 2014

ప్రేమ‌ - విప్ల‌వం...2

- మార్క్స్‌, జెన్నీ ప్రేమ కథ
- స్వేచ్ఛానువాదం: ముక్తవరం పార్థసారథి
        తనలో ఏదో మార్పు వస్తోంది. ఈ పరిస్థితి గురించి మొదటి సంవత్సరంలోనే తండ్రికో లేఖ రాశాడు కార్ల్‌ :
'డియర్‌ ఫాదర్‌,
               మిమ్మల్ని వదలి వచ్చినప్పుడు నా ముందు ఓ కొత్త లోకం ఆవిష్కృతమైంది. అది ప్రేమ లోకం. ఇంకా నేను చేరుకోలేని ఓ ప్రేమ లోకం. బెర్లిన్‌కు రావటం ఒక అద్భుతమైన అనుభవంగా మిగలాలి. కానీ అది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు. శిలగా మారిన నా మనసుకన్నా కరకు శిలలేమీ నాకు దారిలో కనిపించలేదు. భోజనం
రుచించటం లేదు. జెన్నీ కన్నా అందమైనదీ, ముఖ్యమైనదీ మరేదీ లేదీ లోకంలో. ఇదీ నా ప్రస్తుత పరిస్థితి'.
అప్పటి మార్క్స్‌ ఆలోచనలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయో స్పష్టమౌతూనే ఉంది. కవిత్వం రాయాలనుకుని జెన్నీ కోసం మూడు సంపుటాలు రాశాడు. 'అయినా, నా ప్రేమను వ్యక్తం చెయ్యటానికి ఏ మాత్రం సరిపోదు' అని రాశాడు. ఆ తర్వాత, 'లా' పుస్తకాలు 'క్లాసిక్స్‌' ముగించాడు. 'శిక్షాస్మృతి' 'మతపరమైన న్యాయశాస్త్రం' అధ్యయనం చేశాడు. 'ప్రాచీన రోమన్‌ సివిల్‌ లా' అనువాదం చేశాడు. మూడువందల పేజీలు 'ఫీలాసఫీ ఆఫ్‌ లా' రచించాడు. గ్రీకు నుండి అరిస్టాటిల్‌ రాసిన 'రెటారిక్‌' చరిత్రకారుడు టాసిటస్‌ రాసిన 'జెర్మానియా', కవి ఓవిడ్‌ రాసిన 'సాంగ్స్‌ ఆఫ్‌ శాడ్‌నెస్‌'లను లాటిన్‌ నుండి అనువదించాడు. ఇంగ్లీషు, ఇటాలియన్‌ నేర్చుకున్నాక 'ఒక వ్యంగ్య నవల 'స్కార్పియన్‌ అండ్‌ ఫెలిక్స్‌' రాశాడు. గోతె 'ఫాస్ట్‌' ప్రేరణతో 'ఊలానెమ్‌' అనబడే నాటకం ముగించాడు. ఆ తర్వాత 'పెద్దగా సాధించిందేమీ లేదు' అని రాసుకున్నాడు.
                అయితే, ఇంతటి తీవ్రమైన కృషి ఫలితంగా... అతని మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింది. నగరం వదిలి పల్లెపట్టులలో ప్రశాంతంగా తిరిగి రమ్మన్నాడు డాక్టర్‌. సలహా నచ్చింది. రివర్‌ స్ప్రీ తీరాన వున్న స్ట్రాలౌ గ్రామానికి వెళ్లి ఫిషింగ్‌లో కొంతకాలం గడిపాడు. అక్కడే ఉండటానికి వసతి కూడా దొరికింది. ఇంటి యజమానితో కలసి వేటకెళ్లాడు. అక్కడున్నప్పుడే తండ్రి రాసిన లేఖలో 'నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే హెగెల్‌ను మొదటి నుండి చివరిదాకా చదివాను. అతడి శిష్యుల గురించి కూడా తెలుసుకున్నాను' అని పేర్కొన్నాడు. అప్పటికి హెగెల్‌ మరణించి ఆరేళ్లయింది. అక్కిడి ప్రొఫెసర్లలో, విద్యార్థుల్లో ఆయన ప్రభావం కొంత తగ్గింది. కార్ల్‌ మార్క్స్‌ మేథో ప్రస్థానంలో హెగెల్‌ను దాటి ముందుకు పోక తప్పదు.
                  'మానవ జాతి చరిత్రంతా సంఘర్షణల, పోరాటాల మయమే' అన్నది హెగెల్‌ తాత్వికతకు ప్రాతిపదిక. రెండు ఆలోచనలు సంఘర్షించినప్పుడు మూడో ఆలోచన పుడుతుంది. అది మరో ఆలోచనతో సంఘర్షిస్తుంది. అంటే నిరంతర మార్పు జీవన స్వభావం ఇది. ఇది అనివార్యమని గ్రహించిన హెగెల్‌ దీన్నే 'గతితార్కికత' అన్నాడు. ఈ గతితార్కికత క్రమం, బిగువు (్‌వఅరఱశీఅ) మీద ఆధారపడి ఉంటుంది. ఇవి అవసరం కూడా. ఎందుకంటే చరిత్ర ప్రగతికి సంఘర్షణ అనివార్యం. హెగెల్‌ గతితార్కికత, సంఘర్షణకు ఓ కొత్త అర్థమిచ్చింది. ఎంగెల్స్‌ మాటల్లో 'చరిత్రంతా అర్థంలేని హింసాత్మక సంఘటనల క్రమంలా కాక ఒక అర్థవంతమైన పరిణామ దశలుగా కనిపిస్తుంది. 'హెగెల్‌, ఆత్మ (రజూఱతీఱ్‌) అనే మరో అంశాన్ని కూడా ప్రవేశపెట్టాడు. చారిత్రిక పరిస్థితులలో ఇది ఒక సమూహానికి చెందిన ప్రజలందర్లో ఉంటుంది. వ్యక్తి తనను తాను చరిత్రలో భాగం కానని, తన కృషికందులో భాగం లేదనుకున్నప్పుడు దీని ప్రత్యామ్నాయం. 'పరాయీకరణ' అతణ్ణి ఆవహిస్తుంది.
                ఆరోజుల్లో హెగెల్‌ తాత్విక భానవలు జర్మనీలోని మేధావులందర్నీ ప్రభావితం చేశాయి. డజన్లకొద్దీ హెగెలియన్లు నిరంతరం చర్చించి కొత్త విషయాలు ఆవిష్కరించటానికి ప్రయత్నించారు. మరి, హెగెల్‌ స్వయంగా బోధించిన బెర్లిన్‌ యూనివర్సిటీలో వాతావరణం మరెంత ఉద్రిక్తంగా ఉండేదో ఊహించుకోవాల్సిందే. అక్కడి యువ మేధావులు, ప్రొఫెసర్లు సంస్కరణలు కావాలన్నప్పుడల్లా వాళ్ల నోరు నొక్కేశారు. స్వేచ్ఛ తగ్గింది. ప్రభుత్వం యథాతథ స్థితి వైపే మొగ్గు చూపింది. వాళ్ల సరిహద్దుల కావల 'బెల్జియం, ఫ్రాన్సు, ఇంగ్లాండులలో రాజకీయ, ఆర్థిక, రంగాలలో పెను మార్పులు వస్తున్నాయి. అక్కడ ప్రభువులు ప్రజలకు స్వేచ్ఛనివ్వటమే అందుకు కారణమని వాళ్లకు తెలుసు. ఉక్కును రైలు పట్టాలుగా మార్చారక్కడ. వాటిమీద గంటకు అరవై మైళ్ల వేగంతో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యుచ్ఛక్తి తళుక్కుమంటోంది. టెలిగ్రాఫ్‌ ద్వారా సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చింది. హెగెల్‌ బోధనల ప్రకారం ఇదంతా ఘర్షణ ఫలితమే. సంఘర్షిస్తే పెనుమార్పు - సామాజిక విప్లవం కూడా వస్తుంది.
                   యూరోపియన్‌ మేధావులందర్నీ ఆకర్షించిన అయస్కాంతం బెర్లిన్‌. కేవలం జర్మనులే కాదు, భూస్వామ్య వ్యవస్థ కింద మగ్గిపోతున్న రష్యన్లు కూడా అక్కడికే చేరుకుంటున్నారు. 'విశ్రాంతి' ముగించుకుని బెర్లిన్‌ తిరిగి వచ్చిన కార్ల్‌ బొహిమియన్‌ డాక్టర్స్‌ క్లబ్‌లోని యంగ్‌ హెగెలియన్ల బృందంలో చేరాడు. అక్కడ అతడికిష్టమైన రెండు పనులు నిరాటంకంగా కొనసాగించవచ్చు. ఒకటి తాత్విక చర్చలు. రెండవది తాగుడు.
                బెర్లిన్‌లోని తొలి నెలల్లో మార్క్స్‌ ఎంత నైరాశ్యం అనుభవించాడో, అంతకన్నా ఎక్కువ అనుభవించింది జెన్నీ. తల్లిదండ్రుల మనసు గాయపర్చవద్దని, ఇద్దరూ ఉత్తరప్రత్యుత్తరాలు మానుకున్నారు. కానీ సమాచారం తెలియకపోవటంలో, ఆమెలో అసూయ పెరిగింది. కార్ల్‌ తనను అశ్రద్ధ చేస్తున్నాడు. బెర్లిన్‌ మహానగరంలో తను అతడికి ఇంకా గుర్తుంటుందా! ఇలా బెంగపెట్టుకుని జబ్బు పడింది. ఇది కేవలం శారీరకమనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ జెన్నీది 'డిప్రెషన్‌' అని హైన్రిష్‌ మార్క్స్‌కు తెలుసు. జెన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ రాసుకున్న లేఖల్ని ఒకరివొకరికి చేర్చిన తనకు జెన్నీ పడిన బాధ తెలుసు. ప్రతిసారీ కొడుక్కు 'ఆమె నీ కోసం చేసిన త్యాగం అమూల్యం. సంఘంలో ఆమె గౌరవం నిలబెట్టే బాధ్యత నీదే. ఈ బాధ్యత విస్మరిస్తే నువ్వు క్షమార్హుడివి కాదు...' అని రాశాడు.
                 మూడు సంపుటాల కవితలతో జవాబిచ్చాడు కార్ల్‌. 1836 క్రిస్మస్‌నాటికి ఆమెకు కానుకగా ఇచ్చాడు. మొదటి రెండు ఆసక్తులకూ బుక్‌ ఆఫ్‌ లవ్‌' అనీ, మూడో దానికి 'బుక్‌ ఆఫ్‌ సాంగ్స్‌' అనీ పేరుపెట్టాడు. ఈ మూడు పుస్తకాలూ 'నా శాశ్వత ప్రేయసి జెన్నీ వాన్‌వెస్ట్‌ఫాలెన్‌'కు అంకితం'. ఈ పుస్తకాలను పదిలంగా దాచుకున్న జెన్నీ, కార్ల్‌ ప్రేమోధృతాన్ని చూసి తనలోతానే నవ్వుకుంది. కానీ ఆ డిసెంబరులో వాటిని చేతిలోకి తీసుకుని స్పృశించినప్పుడు కన్నీరుబికి వచ్చింది. 'జెన్నీ నెమ్మదిగా తన తల్లిదండ్రులకు నచ్చజెబుతుందిలే' అని తన సోదరుడికి హామీ ఇచ్చింది సోఫీ.
                     అయితే, జెన్నీకి అదంత సులభమేమీ కాదు. ఈ కాలంలో ఆమె రాసిన లేఖలేవీ లభ్యం కావటం లేదు గాని, హైన్రీష్‌ మార్క్స్‌, కార్ల్‌కు రాసిన ఉత్తరాల ద్వారా కొంత సమాచారం తెలుస్తుంది. ఒకవైపున ఉద్యోగం త్వరగా సంపాదించుకొమ్మని చెబుతూనే, జెన్నీ మనసు గాయపరచవద్దంటూ కొడుకును హెచ్చరించాడు. హైన్రీష్‌కు కొడుకంటే ప్రేమ ఉన్నమాట నిజమేకాని, జెన్నీలాంటి సంస్కారవంతురాలు, సౌందర్యవతి, గమ్యం లేకుండా తిరుగుతున్న యువకుణ్ణి ఇష్టపడుతున్నది. 'కనీసం ఆమె కోసమైనా క్రమశిక్షణతో బతుకు' అంటూ పలుసార్లు హెచ్చరించాడు' ఆమె సంతోషానికే జీవితం వెచ్చించాలి' అన్నాడు.
కార్ల్‌, జెన్నీని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన మాట నిజమే గాని, యూనివర్సిటీలో, యంగ్‌ హెగెలియన్లతో అతడి జీవితం పెనవేసుకుపోయింది. ప్రియురాలి ప్రేమ కోసం దహించుకుపోతున్నాడు. కానీ మేధో జీవితం, చర్చోపచర్చలు అతడికి ఊపిరిసలపనివ్వటం లేదు. మార్క్స్‌ జీవితమంతా రెండు పార్శ్వాలు అతణ్ణి శాసించాయి. ఒకటి ప్రేమ లోకం. మరొకటి మేధో మధనం.
                మార్క్స్‌ మొదట అడాల్ఫ్‌ రూటెన్‌బర్గ్‌ అనబడే జాగ్రఫీ ప్రొఫెసర్‌ వద్ద శిష్యరికం చేశాడు. ఈ రూటెన్‌బర్గ్‌ అప్పటికే ఒక వార్తాపత్రికలో కొన్ని వివాదాస్పద వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత ఒక రాడికల్‌ మత శాస్త్రాచార్యుడు బ్రూనోబార్‌ ప్రభావంతో కొన్నాళ్లున్నాడు. 'భగవంతుడు ఒక హేతుబద్ధమైన శక్తి. అతడే గతితార్కిక చారిత్రక చోదకుడు' అనబడే హెగెల్‌ అభిప్రాయంతో, వాంగ్‌ హెగెలియన్లు విభేదించారు. మనిషి తన చరిత్రను తనే నిర్మించుకుంటాడు. ఏ అదృశ్య శక్తీ అతడికి దారి చూపించటం లేదన్నది వీళ్ల వాదన. అయితే, ఈ వాదన పరిణామాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదు.
దేవుడు చరిత్రగతిని శాసించటం లేదని అంగీకరిస్తే, ప్రభువులు దైవాంశ సంభూతులు కారన్నమాట. మరి, రాజు మానవ మాత్రుడే అయితే, ఇతర్లు అతడి అధికారాన్ని ప్రశ్నించటానికి, ఎదిరించటానికీ అర్హులే.
                రాజకీయపరంగా డైనమైట్‌ లాంటి వాదన ఇది. పందొమ్మిదేళ్ల మార్క్స్‌ వీటిని ఆసక్తిగా గమనించాడు. ఈ చర్చా బృందాలలో, తనకన్నా పదేళ్లు పెద్దవాళ్లైన సీనియర్‌ ప్రొఫెసర్లు కూడా అతణ్ణి సమవుజ్జీగా అంగీకరించారు. ('రూసో, వోల్టేర్‌, హైన్‌, హెగెల్‌ కలిస్తే ఒక మార్క్స్‌ అవుతాడు' అన్నాడో సీనియర్‌ ప్రొఫెసర్‌) ఈ చర్చలో. మార్క్స్‌, ఒక రాజీపడని ఖచ్చితమైన వాదనా ధోరణిని అలవర్చుకున్నాడు. పరిణామ ఫలితంగా అనేకమంది శత్రువులు కూడా తయారయ్యారు. కొన్ని దశాబ్దాల తర్వాత 'మార్క్సిజం'గా పిలువబడిన భావజాలానికి ఆ వాదనలే బీజాలు. ఈ సమయంలో మార్క్స్‌కు అగ్నికీలల మీద నడుస్తున్నట్టుగా ఉండి ఉంటుంది. లుడ్విగ్‌ వాన్‌ వెస్ట్‌ఫాలెన్‌తో కలిసి చర్చించిన ఊహాజనిత సోషలిస్టుల అభిప్రాయాలు, ఈ చర్చలతో పోల్చితే, పిల్లల కథల్లా వున్నాయి.
                  ఈ కాలంలో మార్క్స్‌కు మూర్‌ అని మారు పడింది. తెలిసినవాళ్లందరూ అతణ్ణాపేరుతోనే పిలిచారు. నల్లటి జుత్తూ, చామనచాయ రంగులో ఉన్న చర్మానికే గాక, షిల్లర్‌ 'రాబర్స్‌' నాటకంలోని పాత్ర 'కార్ల్‌ వాన్‌మూర్‌'కు కూడా ఈ పేరు (ఎశీబతీ) సంకేతం. జీవితమంతా అతని మిత్రులందరికీ అతడు మూర్‌.
                       బెర్లిన్‌ యూనివర్సిటీ మేధావుల్లో మార్క్స్‌ ప్రముఖ పాత్ర పోషించినా, మార్క్స్‌ గురించి, తండ్రికి మాత్రం సదభిప్రాయం లేదు. కుటుంబానికీ, తనకూ మధ్య ముఖ్యంగా, జెన్నీతో కూడా దూరం పెరిగిపోతున్నదని బాధపడ్డాడు. ఇక కొడుక్కి ఎవరూ పట్టరా! ఆగస్టు 1837లో రాసిన ఒక లేఖలో, ఇంటిని పూర్తిగా విస్మరించినందుకు ముఖ్యంగా పదకొండేళ్ల చిన్నకొడుకు ఎడ్వార్డ్‌ అనారోగ్యంతో వున్నా పట్టించుకోనందుకు మూడు నాలుగు నెలల తర్వాత ఎడ్వార్డ్‌ మరణించాడు. తల్లి బెంగపెట్టుకుంది. ఏడెనిమిది నెలలపాటు తండ్రి జబ్బుపడ్డాడు. ఒకసారి, కొడుక్కు కుటుంబం పట్ల వుండే బాధ్యతల్ని గుర్తుచేస్తూ మరో లేఖ రాశాడు. అందులో మొదటి అంశం :' నవ యువకుడిగా జెన్నీకి మంచి భవిష్యత్తునివ్వటం నీ బాధ్యత. అంటే ఈ ప్రపంచంలో మంచి భవిష్యత్తు. అంతేకాని, పొగాకు పొగలతో నిండిన గదుల్లో, దీపం వెలుగులో విశృంఖలంగా ప్రవర్తించటం కాదు.'' మరో విషయం కూడా గుర్తు చేశాడు. ''జెన్నీ తండ్రికి నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులున్నా, ఆ మహానుభావుడు మీ పెళ్లికి అంగీకరించాడు. నిజానికి ఏ తల్లిదండ్రులూ ఇలాంటి సంబంధాన్ని హర్షించరు. కొన్నిసార్లు నాకే అనిపించింది. అంతమంచి పిల్లను చేసుకునే అర్హత నీకుందా అని!''
                 తండ్రికి, కొడుకు పట్ల కోపం రోజురోజుకు పెరిగింది. వాడికి మేమంటే గౌరవం లేదు అన్నాడు. మరోసారి కార్ల్‌ లేఖను తిప్పి పంపిస్తూ 'పిచ్చిరాతలతో ప్రతిభను వృధా చేసుకుంటున్నావు. రాత్రంతా నువ్వు కూర్చుని సృష్టిస్తున్నది ఈ దయ్యం పిల్లలనా?'' అనీ చీవాట్లేశాడు.
                     'ఒక సంవత్సరంలో, అత్యంత సంపన్నుడి కన్నా ఎక్కువ ఖర్చుపెట్టావు. దానికో కొత్త సిద్ధాంతం కనుక్కుంటున్నానని చెప్పి రాసినవన్నీ చింపేస్తున్నావు. అలాంటి నీకు చిన్న చిన్న విషయాలేం గుర్తుంటాయి. చెప్పు?' అంటూ వ్యంగ్యంగా దెప్పిపొడిచాడు మరోసారి.
తను మరణానికి దగ్గరగా వున్నానన్న భయంతో హైన్రిష్‌ నిస్పృహ, కోపం మరింత పెరిగింది. ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకున్నాడు. కానీ అవి నెరవేరే అదృష్టం తనకు లేదు. ఫిబ్రవరి 1838లో రాసిన చివరి ఉత్తరంలో 'నువ్వే నా సర్వస్వం' నీ మీదే నా ఆశలన్నీ అందుకే నువ్వంటే నాకు అప్పుడప్పుడూ చిరాకు, కోపం.కాని ఇక టైం లేదు. అలసిపోయాను. నీ కోసం నిరీక్షించినా ఫలితం లేదు. ఇదే నా చివరి ఆలింగనం' అంటూ..
                   ఈస్టర్‌ పండగకు కూడా ట్రేయర్‌కు రావాలనుకోలేదు. అప్పటికే ఒక సంవత్సరంలో తండ్రి సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు బెర్లిన్‌లో. ఈ పరిస్థితుల్లో ట్రేయర్‌కు అయిదు రోజుల ప్రయాణం తలకు మించిన భారమవుతుంది. కానీ దిగజారుతున్న తండ్రి ఆరోగ్యం, తల్లీ చెల్లాయి రాస్తున్న ఉత్తరాలు రాకను అనివార్యం చేశాయి. ఏప్రిల్‌లో ట్రేయర్‌కు వచ్చి మే 7దాకా వున్నాడు. (తన ఇరవయ్యవ పుట్టినరోజు జరుపుకుని వెళ్లాడు). క్షయ, లివర్‌ వ్యాధులతో మే, 13నాడు మరణించాడు హైన్రిస్‌ మార్క్స్‌.
                     తండ్రి అంత్యక్రియలకు రాకపోవటాన్ని ప్రస్తావిస్తూ, కొందరు చరిత్రకారులు మార్క్స్‌ది 'రాతి గుండె' అన్నారు. ఇది అప్పటి వాస్తవాలను అర్థం చేసుకోవటమే. ఒకవేళ అతడు తిరిగి వచ్చినా అప్పటికీ అంత్యక్రియలు జరిగిపోయి ఉండేవి. పైగా వెళ్లేటప్పుడే, తండ్రి వీడ్కోలు తీసుక్నున్నాడు కార్ల్‌. అంతేకాదు జీవితాంతం తండ్రి ఫొటోను, తన కోటు జేబులో దాచుకున్నాడు. నలభై అయిదేళ్ల తర్వాత మార్క్స్‌ మరణించినప్పుడు, అదే ఫొటోను మార్క్స్‌ శవపేటికలో పెట్టాడు ఎంగెల్స్‌.
                హైన్రిస్‌ మరణంతో, ఇంటివద్ద ఇప్పుడు మార్క్స్‌ను చీవాట్లేసే వాళ్లూ, కోప్పడే వాళ్లూ, అతడి మీద కోపం తెచ్చుకునేవాళ్లూ ఎవరూ లేరు. ఫిలాసఫీ చర్చలు ఆపి గౌరవప్రదమైన పని ఏదైనా చెయ్యమని ఎవరూ అతణ్ణి హెచ్చరించలేదు కానీ, అతని ఇంటి నుండి కాకపోయినా, మరికొన్ని సీరియస్‌ హెచ్చరికలు అతణ్ణి చేరాయి. వెస్ట్‌ఫాలెన్‌ ఇంటి నుండి వచ్చాయవి. అవి హెచ్చరికలు కావు. ఒక రకంగా బెదిరింపులు.

              ఒకవైపున ఉద్యోగం త్వరగా సంపాదించుకొమ్మని చెబుతూనే, జెన్నీ మనసు గాయపరచవద్దంటూ కొడుకును హెచ్చరించాడు. హైన్రీష్‌కు కొడుకంటే ప్రేమ ఉన్నమాట నిజమేకాని, జెన్నీలాంటి సంస్కారవంతురాలు, సౌందర్యవతి, గమ్యం లేకుండా తిరుగుతున్న యువకుణ్ణి ఇష్టపడుతున్నది. 'కనీసం ఆమె కోసమైనా క్రమశిక్షణతో బతుకు' అంటూ పలుసార్లు హెచ్చరించాడు' ఆమె సంతోషానికే జీవితం వెచ్చించాలి'అన్నాడు.

                మిమ్మల్ని వదలి వచ్చినప్పుడు నా ముందు ఓ కొత్త లోకం ఆవిష్కృతమైంది. అది ప్రేమ లోకం. ఇంకా నేను చేరుకోలేని ఓ ప్రేమ లోకం. బెర్లిన్‌కు రావటం ఒక అద్భుతమైన అనుభవంగా మిగలాలి. కానీ అది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు. శిలగా మారిన నా మనసుకన్నా కరకు శిలలేమీ నాకు దారిలో కనిపించలేదు. భోజనం రుచించటం లేదు. జెన్నీ కన్నా అందమైనదీ, ముఖ్యమైనదీ మరేదీ లేదీ లోకంలో. ఇదీ నా ప్రస్తుత పరిస్థితి.

                 తండ్రి అంత్యక్రియలకు రాకపోవటాన్ని ప్రస్తావిస్తూ, కొందరు చరిత్రకారులు మార్క్స్‌ది 'రాతి గుండె' అన్నారు. ఇది అప్పటి వాస్తవాలను అర్థం చేసుకోవటమే. ఒకవేళ అతడు తిరిగి వచ్చినా అప్పటికీ అంత్యక్రియలు జరిగిపోయి ఉండేవి. పైగా వెళ్లేటప్పుడే, తండ్రి వీడ్కోలు తీసుక్నున్నాడు కార్ల్‌. అంతేకాదు జీవితాంతం తండ్రి ఫొటోను, తన కోటు జేబులో దాచుకున్నాడు. నలభై అయిదేళ్ల తర్వాత మార్క్స్‌ మరణించినప్పుడు, అదే ఫొటోను మార్క్స్‌ శవపేటికలో పెట్టాడు ఎంగెల్స్‌.
(మేరీ గేబ్రియెల్‌ 'లవ్‌ అండ్‌ కేపిటల్‌' ఆధారంగా)
సశేషం
ఫోన్‌: 91776 18708

No comments:

Post a Comment