కష్టాల్ని అధిగమించే సాధనమైంది. 'కాపిటల్' (పెట్టుబడి) రచన ప్రారంభించే (1851) నాటికి కనాకష్టంగా రోజులు గడపాల్సిన పరిస్థితి వారిది. అలాంటి కాలంలోనూ జెన్నీ మార్క్స్ చూపిన లాలన, అనురాగం, అందించిన ఓదార్పు, తోడ్పాటు అమేయమైంది. ఆమె ప్రేమ లేకపోతే మార్క్స్ 'కాపిటల్' రాయడం అంత సులువు కాకపోయేది. 'కాపిటల్' పీడిత ప్రజల విముక్తికి గొప్ప ఆయుధం. దాన్ని రూపొందించే క్రమాన మార్క్స్, జెన్నీల జీవితంలోని బహుళ పార్శ్వాలు ఏమిటో మేరి గాబ్రియేల్ 'లవ్ అండ్ కాపిటల్' పేరుతో పుస్తకం రాసే నాటికి లోకానికి పెద్దగా తెలియవు. అమెరికన్ జర్నలిస్టు, రచయిత అయిన మేరి గాబ్రియేల్ ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు. ప్రముఖ రచయిత ముక్తవరం పార్థసారథి ఆ పుస్తకం చదివి ఎంతో ముగ్ధులయ్యారు. చాలామంది మార్క్సిస్టు మిత్రులతో ఆ పుస్తకం విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చదివాక దాదాపు వందమంది ఈ పుస్తకాన్ని తెప్పించుకొని చదివారు. ఇంగ్లీషులో వున్న 'లవ్ అండ్ కాపిటల్' తెలుగు పాఠకులకు అందాలని భావించారు. ఈ పుస్తకం తెలుగువారు చదవాలని తపించిన ముక్తవరం పార్థసారథి ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనేకమంది ఆంగ్ల రచయితలని, వారి రచనల్ని తెలుగువారికి పరిచయం చేసిన సుదీర్ఘమైన అనుభవం కలిగిన సృజనశీలి ముక్తవరం పార్థసారథి. మేరీ గాబ్రియేల్ రచించిన 'లవ్ అండ్ కాపిటల్' గ్రంథానికి వారు అందిస్తున్న స్వేచ్ఛానువాదమిది. ధారావాహికగా వెలువడే ఈ రచన 'ప్రజాశక్తి' పాఠకులకు ప్రత్యేకం.
ట్రీయర్, జర్మనీ, 1835
ట్రీయర్‌లోని యువకుల కలలరాణి జెన్నీ వాన్ వెస్ట్‌ఫాలెన్. ఆ వూళ్లో ఇంకా ఆడపిల్లల్లేరని కాదు. అంతకన్నా సంపన్న కుటుంబాలు కూడా వున్నాయి. (బేరన్ కన్నా) పెద్ద హోదా కలిగిన వాళ్లూ వున్నారు. కేవలం డబ్బూ, అందమే కాదు. కానీ అంత మేథో పరిణతి, చతురత ఎంతమందికి వుంటుంది. స్థానిక అరిస్టొక్రస్టీలో బేరన్ గారికో ప్రత్యేక గుర్తింపు వున్నది. మోసెల్ నది ఒడ్డున వున్న ఆ వూర్లో, జెన్నీ తండ్రి బేరన్ లుడ్విగ్ వాన్ వెస్ట్‌ఫాలెన్, ప్రభుత్వ కౌన్సిలర్ పదవిలో వున్నాడు. అంటే ప్రష్యన్ ఉన్నతాధికారులలో ఒకడు. పన్నెండు వేల జనాభా వున్న ట్రీయర్‌లో అందరికన్నా ఎక్కువ వేతనం అందుకుంటున్నది ఆయనే.
అక్కడి సంపన్నుల నాట్య వినోద కార్యక్రమాలలో, బాల్ డాన్సులలో, పదిహేడేళ్ల జెన్నీ తప్పక వుండాల్సిందే. అందమైన డ్రెస్సులతో పడుచు అందగత్తెలందరూ అక్కడికి వస్తారు. యువకులు, తమ హోదాను, ప్రదర్శించుకుంటూ నచ్చిన యువకులను ఇంప్రెస్ చెయ్యాలనుకుంటారు. కొవ్వొత్తి దీపాల వెలుగులో అక్కడ ఆడపిల్లల బేరసారాలు కొనసాగుతాయి. తన అందంతో, ఠీవితో ఎంతమందిని లొంగదీసుకోవచ్చో పరీక్షించుకుంటుంది జెన్నీ. హోదాకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందక్కడ. అరిస్టొక్రాట్లు, సామాన్యులతో కలవరు.
ఒకనాడామె ఒక యువ లూటినెంట్ ప్రేమను అంగీకరించి, అతణ్ణి పెళ్లి చేసుకుంటానంది. కానీ కొద్దినెలలకే తన అభిప్రాయం మార్చుకుంది. ఇది ఒకరకంగా, అప్పటి సాంఘిక కట్టుబాటును అతిక్రమించటమే. ఈ మచ్చ తొలగిపోవటానికి కొంతకాలం పట్టింది. ఈలోగా ఇంట్లోనే, తండ్రి శిక్షణలో తన 'చదువు' కొనసాగించింది జెన్నీ. అప్పటికే ఫ్రాన్సులో బలపడుతున్న ఊహాజనిత తాత్వికవాదం 'సోషలిజం' గురించి అధ్యయనం చేసింది. జర్మన్ రచయతల్నీ, సంగీతకారుల్నీ, తత్వవేత్తల్నీ ఆపోసన పట్టింది. తను చదివిన మహానుభావులందరూ చెప్పిందొక్కటే. నమ్మిన దానికోసం, ఆదర్శాల కోసమే బతకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వేచ్ఛను తాకట్టు పెట్టకూడదు. 'సృజన' కోసమే కృషి కొనసాగించాలి. ఆ 'సృజన' కొత్త తాత్విక భావన కావచ్చు. కళా సృష్టి కావచ్చు. మానవ సంబంధాలను మరింత మెరుగుపర్చటం కావచ్చు, నీ కలల్ని సాకారం చేసుకోవటం ముఖ్యం. అందుకోసం ఎంతటి మూల్యమైనా చెల్లించటానికి వెనుకాడకూడదు. ఒకప్పుడు దూరంగా ప్రకాశించిన వెలుగు తనలోనే వుందన్న అవగాహన వచ్చింది. ఎంగేజ్‌మెంట్‌ను నిరాకరించి తను చేసిన చిన్నపాటి తిరుగుబాటు ఫలితంగా ఆమెకు, తను చదివిన తాత్వికులలో కొత్త విప్లవ ధోరణులు కనిపించాయి. జర్మన్ తత్వవేత్త ఇమ్మాన్యుమేల్ కాంట్ 'మరొకరి మీద ఆధారపడిన మనిషి, మనిషి అనిపించుకోవటానికే అనర్హుడు. తనకు తాను మరొకరి ప్రైవేటు ఆస్తి కావటానికి అంగీకరించడన్నమాట.'' అని రాశాడు. పురుషుల గురించే కాంటే ఆ మాట రాయగలిగాడంటే స్త్రీలకు అది మరో వంద రెట్లు ఎక్కువ వర్తిస్తుంది. తను చదివిన 'రొమాంటిక్' తత్వవేత్తలందరూ స్త్రీ పురుషులిద్దరికీ సంపూర్ణ స్వేచ్ఛ కావాలని వాదించాడు. కేవలం సామాజికపరమైన స్వేచ్ఛ మాత్రమే కాదు. దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటున్న రాజులను, రారాజుల అధికారాన్ని కూడా ప్రశ్నించగలిగే స్వేచ్ఛ కావాలి.
ఫిబ్రవరి 1832లో, జెన్నీ పద్దెనిమిదవ పుట్టినరోజు నాటికి ఆమె చేసిన అధ్యయనం ప్రకారం తన చుట్టూ వున్న ప్రపంచం రెండుగా విడిపోయింది. ఒక పక్షం వాళ్లు, మారుతున్న కాలంతోపాటు ప్రభువులు కూడా మారి నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఇతర్లు యధాతథ స్థితి కొనసాగాలన్నారు. చీలిక తన కుటుంబంలోనే స్పష్టంగా కనిపించింది. ప్రష్యన్ అధికారి అయినప్పటికీ, తన తండ్రి ఫ్రెంచి సోషలిజం వ్యవస్థాపకుడు కాంటే క్లాడ్ హెన్రిడ్ సెయింట్ సైమస్ పట్ల అభిమానం పెంచుకున్నాడు. తండ్రి అభిప్రాయాలే కూతురికి ప్రేరణ. అయితే, తన 'ప్రేరణ'తో ఆమె జీవితం ఎన్ని మలుపులు తీసుకుంటుందో, ఆయనకు తెలిసే అవకాశం లేదు.
ఫ్రెంచివాళ్లు సంప్రదాయికంగా 'సమానత్వం, సౌభ్రాతృత్వం' భావనను నమ్ముతారు. లుడ్విగ్ వాన్ వెస్ట్‌ఫాలెన్‌కు ఈ విషయం చాలా కాలంగా తెలుసు. పశ్చిమ ప్రష్యాను నెపోలియన్ గెల్చుకున్నప్పుడు ఆయనకెనిమిదేళ్లు. ఆనాటి నుండీ ఫ్రెంచి విప్లవ నినాదం 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం' చట్టం మందు అందరూ సమానమే' అనే భావనా, వ్యక్తి హక్కులు, మత సహిష్ణుత, అర్థబానిస వ్యవస్థ రద్దు హేతుబద్ధమైన పన్ను విధానం, అక్కడి ప్రజల జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చాయి. అయితే, ఫ్రెంచి ప్రభావం, ఈ సంస్కరణవాదానికే పరిమితం కాలేదు. ప్రజలను అజ్ఞానంలో వుంచి పబ్బం గడుపుకుంటున్న పాలకులను తొలగిస్తే, ప్రజలే మరింత మెరుగైన సమాజాన్ని విస్మరించుకుంటారన్నది ఫ్రెంచి రివల్యూషనరీ, ఎన్‌లైటెన్‌మెంట్ తాత్వికుల నమ్మకం. ఈ కొత్త వ్యవస్థలో పుట్టుకతో వచ్చిన హోదాకు కాక, ప్రతిభతో సాధించిన దానికే విలువ వుంటుంది. ఈ భావనలు అప్పుడే ఆవిర్భవిస్తున్న వాణిజ్య తరగతిని బాగా ఆకట్టుకున్నాయి.
అయితే, ఎంత ఉన్నత, అభ్యుదయ భావాలున్నా, విదేశీ పాలనను ప్రజలెప్పుడూ హర్షించరు. సహజంగా ప్రష్యన్లు ఫ్రెంచివాళ్ల నుండి విముక్తి కోసమే ఉద్యమించారు. 1813లో లుడ్విగ్‌ను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు గాను రెండేళ్లపాటు నిర్బంధించారు. నెపోలియన్ పరాజయం తర్వాత, విడుదలైనా అతడు ఫ్రెంచి తాత్వికుల ప్రభావం నుండి మాత్రం కోలుకోలేదు.
'సోషలిజం' అత్యుత్తమ సిద్ధాంతమనే భావన క్రమంగా సర్వత్రా బలపడింది. జర్మన్ సమాఖ్యలో వున్న 39 రాజ్యాలకు మాత్రం భయం పట్టుకుంది. తమ పశ్చిమ సరిహద్దులో(ఫ్రాన్సుకు సమీపంలో) జరుగుతున్న అల్లర్లను, తిరుగుబాట్లను పాశవికంగా, ఉక్కుపాదంతో అణచివేశారు సమాఖ్యలోని దేశాధినేతలు.
అయినప్పటికీ, జర్మన్ సమాఖ్యలోనే యువ జర్మనీ పేరుతో ప్రజలకు మరిన్ని హక్కులు కావాలంటూ కొందరు ఉద్యమించారు. ప్రభుత్వం ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని మరింత తీవ్రంగా అణచివేయ ప్రయత్నించింది.
జెన్నీకి వరసకు అన్న అయిన ఫెర్డినాండ్ (లుడ్విగ్ మొదటి భార్య కుమారుడు) ఆమెకన్నా పదిహేనేళ్లు పెద్దవాడు. ప్రభుత్వ చర్యల్ని సమర్థించాడు. లుడ్విగ్ మాత్రం ఉద్యమకారుల వాదనలతో ఏకీభవించాడు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు సరికదా, వాళ్ల నోరు నొక్కటానికే ప్రయత్నిస్తున్నది. అవకాశమున్నప్పుడల్లా, తెలిసినవాళ్లందరికీ 'సోషలిజం' బోధించటం ప్రారంభించాడు లుడ్విగ్. ఈ ప్రవచనాలన్నీ బుద్ధిగా విన్న ఒక విద్యార్థిని, తన కూతరు జెన్నీ. తను చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించే మరో కుర్రవాడు, తన సహోద్యోగి కుమారుడు కార్ల్‌మార్క్స్.
(ఎంత ఉన్నత, అభ్యుదయ భావాలున్నా, విదేశీ పాలనను ప్రజలెప్పుడూ హర్షించరు. సహజంగా ప్రష్యన్లు ఫ్రెంచివాళ్ల నుండి విముక్తి కోసమే ఉద్యమించారు. 1813లో లుడ్విగ్‌ను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు గాను రెండేళ్లపాటు నిర్బంధించారు.)
1832లో మార్క్స్‌కు పద్నాలుగేళ్లు. లుడ్విగ్ చిన్న కొడుకు ఎడ్గార్‌తో కలిసి ఫ్రీడ్రిక్ విల్‌హెల్మ్ జిమ్నేసియం (ప్రభుత్వ పాఠశాల)లో చదువుకుంటున్నాడు. గ్రీక్, లాటిన్, జర్మన్ భాషల్లో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడు. కానీ గణితం, చరిత్రలో పెద్దగా ఆసక్తి లేదు. సహ విద్యార్థుల్లో గుర్తింపు తెచ్చుకోవలసినంత ప్రత్యేక ప్రతిభ ఏమీ ప్రదర్శించలేదు. కొద్దిగా నత్తి వుండేది. కొన్ని అక్షరాలను సరిగ్గా పలకలేక పోయేవాడు. బహుశా ఈ కారణంగా మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. లుడ్విగ్ శిక్షణలో సాహిత్యం - ముఖ్యంగా షేక్స్‌పియర్ జర్మన్ రొమాంటిక్ కవులు హిల్లర్, గ్యోతెలను బాగా అధ్యయనం చేశాడు. బాల్యం నుండే ఊహాజనిత సోషలిస్టు భావజాలాన్ని కూడా వంట బట్టించుకున్నాడు. అరవై రెండేళ్ల లుడ్విగ్, యువ మార్క్స్ పలు సమకాలీన విషయాలు చర్చిస్తూ మోసెల్ నదీ తీరంలో వున్న కొండలన్నీ చుట్టి వచ్చారు. ఆనాటి మధురానుభూతిని మార్క్స్ తరువాతి రోజుల్లో పలుసార్లు గుర్తు చేసుకున్నాడు. క్లాసులో బాగా చదవని కుర్రాడు, తను చెప్పిన విషయలను అంతబాగా అవగాహన చేసుకున్నందుకు విస్మయం చెందాడు లుడ్విగ్. అయితే, అతను అంతగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు'. ఎందుకంటే ఇంచుమించు పద్నాలుగవ శతాబ్దం నుండే మార్క్స్‌ది, యూరప్‌లోని ప్రముఖ రేబైల వంశం (రేబై-యూదు మతాధికారులు).
మార్క్స్ తండ్రి పూర్వీకులొకరు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి, 1765లోనే ఒక పుస్తకం రాశాడు. మార్క్స్ తాత, మీయర్‌లెవీ, ట్రేయర్ నగరానికి రేబైగా నియమితుడైన తర్వాత 'మార్క్స్'ను తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. మార్క్స్ మేనమామ ఒకతను 1827లో కూడా ట్రేయర్‌కు రేబైగా వున్నాడు. మార్క్స్ మతామహుడు హాలండ్‌లోని నైమెజెన్‌లో రేబైగా పనిచేశాడు. కేవలం మతాధికారులుగానే గాక ఈ రేబైలు, మారుతున్న సామాజిక పరిణామాలలో, తమ వాళ్లకు అండగా ఉండి, తగు సలహాలిచ్చి ఆదుకున్నారు.
పశ్చిమ ప్రష్యాను ఫ్రెంచివాళ్లు ఆక్రమించుకున్న తర్వాత, అధిక సంఖ్యాకులైన క్రిస్టియన్లు, యూదులను అనుమానించటం ప్రారంభించారు. శతృత్వం కాకపోయినా, తమలో ఒకరిగా కాక పరాయివాళ్లుగానే చూశారు. అయితే, ట్రేయర్ ఫ్రెంచి అధీనంలో వున్న 1806-1813 మధ్యకాలంలో ఈ విభేదాలు కొంత తగ్గి, సమానత్వభావన ఏర్పడింది. ఇదే అదునుగా కార్ల్ తండ్రి హెర్షెల్ మార్క్స్, న్యాయవిద్య అభ్యసించి, ట్రేయర్‌లో తొలి యూదు న్యాయవాదిగా స్థిరపడ్డారు. కొన్నాళ్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. లుడ్విగ్ వాన్ వెస్ట్‌ఫాలెన్ లాగా ఆయన కూడా, రాజకీయ, సామాజిక అభిప్రాయాలలో, ప్రష్యన్లకన్నా ఫ్రెంచివాళ్లకే దగ్గిర. వోల్టేర్, రూసో (ఫ్రెంచి రచయితలు, తాత్వికులు)లు ఆయనకు కంఠతా వచ్చు. హేతుబద్ధంగా ఆలోచిస్తే, అన్నిసమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని నమ్మాడు. కానీ, నెపోలియన్ పరాజయంతో, ప్రష్యన్ ప్రభుత్వం, యూదులకిచ్చిన హక్కుల్ని రద్దుచేసి, 1815లో వాళ్లు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులని కూడా ప్రకటించింది. మరో ఏడాది తర్వాత వాళ్లు న్యాయవాద వృత్తి చేపట్టటాన్ని నిషేధించింది. ఈ కొత్త ప్రభుత్వ ఆదేశం వల్ల నష్టపోయిన వారిలో హెర్షెల్ ఒకరు. అయితే, వెంటనే క్రిస్టియన్‌గా మతం మార్చుకుని, వృత్తిని కొనసాగించాడు. అలా 1817లో తన ముప్పై అయిదవ ఏట హెర్షెల్ లూతరన్‌గా మారి హెర్షెల్ మార్క్స్ అని పేరు పెట్టుకున్నాడు.
అప్పటికి ఆయన వివాహమై మూడేళ్లైంది. భార్య హెన్రియెట్టా ప్రెస్‌బర్గ్ విద్యావంతురాలు కాదుగాని, ఒక సంపన్న యూదు కుటుంబం నుండి వచ్చింది. అప్పటికే వాళ్లకిద్దరు పిల్లలు. 1818లో పుట్టన మరో కొడుక్కి 'కార్ల్' అని పేరు పెట్టారు. తన తల్లిదండ్రుల మీది అభిమానంతో వాళ్ల జీవితకాలంలో ఆమె క్రిస్టియన్‌గా మారలేదు. పిల్లలు కూడా 1824 దాకా కొత్త మతం స్వీకరించలేదు. అయితే, వీళ్ల మతమార్పిడి మత కారణాల వల్ల కాక కొన్ని తక్షణ అవసరాల దృష్ట్యా జరిగింది. ఆరేళ్ల కార్ల్‌కు అతడు యూదు అన్న కారణంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం నిషేధించారు.
బాల్యంలో, కార్ల్, ఈ మత, సాంస్కృతిక సమస్యల సుడిగుండంలో గడిపాడు. ఒక కాథలిక్కు నగరంలో, యూదుల ఇంట్లో అతడొక లూతరన్. అతడి తండ్రే పాఠాలు చెబుతున్న గురువూ, ప్రభుత్వ సేవకులుగా వున్నారుగాని, వ్యక్తి స్వేచ్ఛను ప్రచారం చేస్తున్న ఫ్రెంచి తాత్వికులను అభిమానిస్తున్నారు. ఇక వెస్ట్‌ఫాలెన్ అయితే, సోషలిస్టే.
మార్క్స్, వెస్ట్‌పాలెన్‌ల కుటుంబాలు ఇరుగుపొరుగులని అనేకమంది చరిత్రకారులు రాశారు. కాని నిజానికి రెండు ఇళ్ల మధ్య బాగా దూరముంది. సాయంత్రాలు, వెస్ట్‌ఫాలెన్ ఇంట్లో డాంటె, షేక్స్‌పియర్, హోమర్‌లను గానం చేసేవారు. (లుడ్విగ్‌కు హోమర్, షేక్స్‌పియర్ కంఠస్తం) సంభాషణ ఎక్కువగా లాటిన్, ఫ్రెంచిలలో సాగేది. తరచుగా ఇంట్లో విందులూ, వినోదాలూ.
మార్క్స్ ఇల్లు దీనికి పూర్తి విరుద్ధం. 1832 నాటికి ఇంట్లో ఎనిమిది మంది పిల్లలున్నారు. కార్ల్ తండ్రి కవితాగానం చెయ్యటం కన్నా తనలో తాను చదువుకోవటం ఇష్టపడేవాడు. తల్లికి జర్మన్ సరిగ్గారాదు. నలుగురితో కలిసి తిరగటం, అందర్నీ ఆహ్వానించటం కూడా ఆమెకిష్టముండదు. ఆదాయానికేమీ లోటు లేదుగాని ఇంట్లో పార్టీలిచ్చే అలవాటు లేదు. పొదుపు చేసి, హైన్రిష్ రెండు ద్రాక్ష తోటలు కొన్నాడు. తండ్రి సలహాలు ఎప్పుడూ పాటించకపోయినా, కార్ల్‌కు ఆయనంటే గౌరవమే. కాని తల్లితో అంత చనువుగా లేడు. ఇంట్లో ఎప్పుడూ ఇలా 'గంభీర' వాతావరణముండటానికి ఆవిడే కారణమని అతడి అభిప్రాయం అయి వుంటుంది.
***
('ప్రియతమా! నావైపు చూసి ఎలా చూపులు పక్కకు తిప్పుకున్నావో : ఆ తర్వాత మళ్లీ చూశావు. ఆ క్షణాన నేనూ అలాగే చూశాను. చివరికి ఇద్దరం దీర్ఘంగా, సూటిగా, లోతుగా చూసుకున్నాం. కళ్లు తిప్పుకోనే లేదు. )
లుడ్విగ్, హైన్రిష్ మధ్య ఇన్ని తేడాలున్నా ట్రేయర్ నగరంలోని రెండు వందలమంది ప్రొటెస్టెంట్లలో ప్రముఖులే. ఇద్దరూ ఒకే క్లబ్బుల్లో సభ్యులు. కార్ల్ మార్క్స్, ఎడ్గార్ (లుడ్విగ్ కుమారుడు) క్లాస్‌మేట్స్. నిజానికి కార్ల్ మార్క్స్‌కు వున్న ఒకే ఒక మంచి మిత్రుడు ఎడ్గార్. కార్ల్, పెద్దక్క సోఫీ, జెన్నీకి మంచి మిత్రురాలు. అదీ కార్ల్, ఎడ్గార్ స్నేహం వల్ల. అంతేకాని కార్ల్... లుడ్విగ్ దగ్గరకు రావటం వల్ల కాదు. జెన్నీ కన్నా అయిదేళ్లు చిన్నవాడు ఎడ్గార్. ఇద్దరికీ సాన్నిహిత్యం ఎక్కువ.
ఎడ్గార్ మంచి చూపరి. కానీ అంతగా చురుకైన వాడు కాదు. అందువల్ల తల్లిదండ్రులూ అక్క (జెన్నీ) వాడినో కంట కనిపెట్టి ఉండేవాళ్లు. కష్టపడే స్వభావమున్న కార్ల్ మార్క్స్‌తో వాడి స్నేహం మంచిదేననుకుని ప్రోత్సహించారు. ఏదిఏమైనా.. కార్ల్ ఆ కుటుంబ సభ్యుడు కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. మార్క్స్.. లుడ్విగ్ శిష్యుడైతే, ఎడ్గార్ .. మర్క్స్ శిష్యుడు. మార్క్స్ శీఘ్ర బుద్ధి, లుడ్విగ్‌ను బాగా ఆకర్షించింది. తను గాఢంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులకు (లుడ్విగ్, ఎడ్గార్) మార్క్స్ నచ్చటంతో జెన్నీ కూడా అతడి గురించి ఆలోచించక తప్పలేదు.
1833, 1834లో నిరసనకారుల పట్ల ప్రభుత్వం అవలంబించిన వైఖరితో రెండు కుటుంబాలూ ఉలిక్కిపడ్డాయి. అప్పటిదాకా జర్మన్ తత్వశాస్త్రాన్ని చర్చించినంత వరకూ, స్కూళ్లలో ఎవరే అభిప్రాయం వ్యక్తపరచినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు (యువకులను తప్పుదోవ పట్టిస్తున్న ఫ్రెంచి తాత్వికుల నుండి వాళ్లు దూరంగా వుంటే చాలనుకుంది). కానీ 1831లో ప్రముఖ జర్మన్ తత్వవేత్త, జార్జి విల్హెం ఫ్రీడ్రిక్ హెగెల్ మరణం తర్వాత, ఆయన అనుయాయులు కొందరు 'మార్పు అనివార్యం' అన్న హెగెల్ సిద్ధాంతం వైపు అడుగులు వేశారు. 'మార్పు' అంటే 'రాజకీయం మార్పు' అని ప్రచారం చేస్తున్న బృందాల కోసం స్కూళ్లనూ, విశ్వవిద్యాలయాలనూ గాలించారు ప్రభుత్వాధికారులు. ప్రభుత్వ గూఢచారి ఒకడు మార్క్స్ చదువుకుంటున్న స్కూల్లో 'సంస్కారవాదం' అదుపు తప్పిందనీ, వాళ్లు నిషేధిత సాహిత్యం చదువుతున్నారనీ నివేదిక ఇచ్చాడు. ఫలితంగా ఒక విద్యార్థిని అరెస్టు చేశారు. హెడ్‌మాస్టర్ను విధుల నుండి తప్పించారు.
అదే సమయంలో ఒక క్లబ్బులో హైన్రీష్ ఇచ్చిన ఉపన్యాసంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టుగా అనుమానించారు అధికారులు.
ఈ రెండు ఘటనలూ జరిగినప్పుడు కార్ల్ మార్క్స్‌కు పదహారేళ్లు. నిష్కారణంగా ప్రభుత్వం అమాయకుల మీద నిఘా పెట్టడం, కక్ష సాధించటం అతని మీద ఎలాంటి ప్రభావం చూపాయో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు 'వాక్ స్వేచ్ఛ, చట్టం మందు అందరూ సమానులే' లాంటివి కేవలం పుస్తకాలకూ, చర్చలకే పరిమితమైనా ఇప్పుడు నిజ జీవితంలో వాటి అవసరమెంతో తెలిసి వచ్చింది. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఏ ఒక్క వ్యక్తికీ ఈ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు లేవు.
'అప్పటి ప్రష్యన్ ప్రభుత్వ దుందుడుకు చర్యలు... అమాయకులను, సాత్వికులను కూడా విప్లవకారులుగా మార్చాయి' అంటాడు. మార్క్సిస్టు పండితుడు హాల్ ట్రేపర్. 'ప్రజాస్వామ్యం, సోషలిజం' గురించి మాట్లాడటం మీదనే ఆంక్షలు విధించటంతో, వీలైన చోటల్లా, గుట్టుగా, చర్చించుకోవటం ఎక్కువైంది. ఈ పదాలు ప్రతి వ్యక్తి నోటా నానటంతో అవి ఫ్రెంచి వాళ్ల నుండి దిగుమతి చేసుకున్న భావాల మాదిరి కాక, జర్మన్లకు అత్యవసరమైన అభిప్రాయాలుగా రూపాంతరం చెందాయి.
జర్మన్ సోషలిజం పితామహుడు లుడ్విగ్ గాల్.. ట్రేయర్‌లో (1835లో) ఒక కరపత్రం ప్రచురించాడు. దాని ప్రకారం కార్మికులు సంపద సృష్టిస్తున్నారు. అధికార వర్గం ఆ సంపదను అనుభవిస్తున్నది. హైన్రీష్ హైన్ కవిత్వాన్ని నిషేధించారు గాని అతడు జర్మనీలో అత్యధిక అభిమానులున్న కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అరెస్టు వారెంట్ విడుదల అయిందని తెలిసి పారిస్‌కు వెళ్లిపోయాడు హైన్రీష్ హైన్ (ఒక ప్రష్యన్ అమాత్యుడు అతడికి మరణ శిక్ష విధించాలన్నాడు). అయినా, అతడి కవితల్ని కాపీ చేసి, విద్యార్థులు స్కూళ్లలో, యూనివర్శిటీల్లో గానం చేశారు. నిరసన తెలపటానికి ఇదో మార్గమని జనసామాన్యం గుర్తించారు.
సహజంగానే.. వెస్ట్‌పాలెన్ ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెన్నీ, ఎడ్గార్, కార్ల్ మార్క్స్ రొమాంటిక్ కవుల్ని మాత్రమే చదువుకోలేదు. అన్యాయాన్ని ఎదిరించాలని కూడా నేర్చుకున్నారు. మారుతున్న ఆర్థిక సంబంధాలలో రైతులు, వృత్తి కార్మికులు, ఫ్యాక్టరీలలో నెట్టవేయబడుతున్నారని ఆరోపించారు సోషలిస్టులు. పారిశ్రామికాభివృద్ధిలో, జర్మనీ, ఇంగ్లండు కన్నా వెనుకబడి ఉంది. కానీ రైన్‌లాండ్ ప్రాంతం మాత్రం ఇందుకు మినహాయింపు. అక్కడ, ట్రేయర్ నగరంలో సంపద, దానితోపాటే పేదరికమూ పెరిగాయి. మారుతున్న సామాజిక స్వరూపం మార్క్స్‌కు అప్పుడప్పుడే అర్థమవుతున్నది.
****
ఏ వృత్తి ఎంచుకోవాలి?
1835లో కార్ల్ మార్క్స్ ట్రేయర్ నుండి యూనివర్సిటీకి వెళ్లటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంలో 'ఏ వృత్తి ఎంచుకోవాలి?' అని స్కూల్లో ఒక వ్యాసం రాశాడు. ఇదీ అందులోని సారాంశం : 'మానవ జాతి కళ్యాణానికీ, వ్యక్తి పరిపూర్ణతకూ దోహదం చేసేదిగా ఉండాలి వృత్తి. పరుల బాగు కోసం కృషి చెయ్యటంలోనే వ్యక్తి కూడా బాగుపడతాడు. కేవలం తన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తే అతడు పండితుడిగానో, గొప్ప రుషిగానో, కవిగానో పేరు తెచ్చుకోవచ్చుగాని పరిపూర్ణత మాత్రం సాధించలేడు.
మావనజాతి శ్రేయస్సు కోసం కృషి చేస్తే... ఏ అడ్డంకులూ మనల్ని నిలువరించలేవు. ఎందుకంటే, ఆ క్రమంలో మనం చేసే త్యాగాలు అందరి మేలు కోసం గనుక. ఆ కృషిలో మనం సంకుచిత, స్వార్థ ప్రయోజనం కోసం కాక, లక్షలాది మంది ఆనందం కోసం మన శాయశక్తులూ ఒడ్డుతాం. ఆ దిశలో మనం చేసే కృషికి శాశ్వతత్వం వస్తుంది. ఈ కార్యసాధనలో మనం నేలకొరిగినా, ఉత్తములు, ఉదాత్తులు మనకోసం అశృవులు కారుస్తారు.''
జెన్నీ వాన్ వెస్ట్‌ఫాలెన్ ప్రేమలో పడ్డ రొమాంటిక్ యువకుడితడే. ఒక చిన్న ఊరి కుర్రాడు మానవాళిని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నాడు. తండ్రి తనకిచ్చిన పుస్తకాలలోని ఉదాత్తులైన హీరోలు ఇలాగే ఉన్నారు. గోతె రెండవ నవలలోని విల్హెల్మ్ మైస్టర్, షిల్లర్ రాసిన 'రాబర్స్' నాటకంలోని కార్ల్ వాన్ మూర్ అలాంటి వారే. దేవతలను ధిక్కరించినందుకు రాతిబండకు కట్టివేయబడ్డ షెల్లీ ప్రోమెతియస్ కూడా ఇతడే. తనకన్నా నాలుగేళ్లు చిన్నవాడైన కార్ల్ మార్క్స్‌లోని ఆత్మవిశ్వాసం ఆమె మనసుదోచింది. అతని మేధో సంపత్తి ఆమెను అప్రతిభురాల్ని చేసింది. ఇక అతడంటే ఆమెకు ఆరాధన.
'లైంగిక సమానత' అనే మాట అప్పుడప్పుడూ వినబడుతున్నా, పందొమ్మిదవ శతాబ్ది ప్రథమార్థంలో, రొమాంటిక్ ఆశయాలతో జీవితం ప్రారంభించిన జెన్నీ, ఉన్నతాశయాల కోసమే జీవితమన్న యువకుడికి అన్ని విధాలా అండగా ఉండగా ఉండటానికి నిశ్చయించుకుంది. తన కర్తవ్యం, అతడు తన కలల్ని సాకారం చేసుకోవటానికి సాయం చెయ్యటమే. అదీ కార్ల్ మార్క్స్ పట్ల జెన్నీకి ఏర్పడిన జీవితకాల నిబద్ధత, ఆ వేసవిలో, అతడు బాన్ యూనివర్సిటీకి వెళ్లటానికి ముందే కార్ల్‌తో ఆమె తన ప్రేమను వ్యక్తం చేసిందో లేదో తెలియదు. కానీ 1836లో జెన్నీ వాన్ వెస్ట్ ఫాలెన్, కార్ల్‌ను వివాహం చేసుకోవటానికి రహస్యంగా అంగీకరించింది.
( ప్రేమ జ్వరంతో రగిలిపోతున్న కార్ల్, బెర్లిన్‌కు కోచ్‌లో అయిదు రోజులు ప్రయాణానికి బయల్దేరాడు. ఈసారి చదువును అశ్రద్ధ చేయొద్దు. ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి. తన కాళ్ల మీద తను నిలబడగలగాలి. జెన్నీకి భర్తగా ఉండగలిగే అర్హత సంపాదించుకోవాలని తలపోశాడు.)
బెర్లిన్, 1838
యూనివర్సిటీలో మొదటి సంవత్సరమంతా మద్యం మత్తులో గడిపాడు మార్క్స్. మానవ కళ్యాణానికి జీవితాన్ని త్యాగం చేస్తానన్న పదిహేడేళ్ల యువకుడు అతి ఖరీదైన అపార్టుమెంటు అద్దెకు తీసుకుని యూనివర్సిటీ పొయెట్రీ క్లబ్‌లో చేరి బూర్జువా టావెర్న్ క్లబ్‌కు అధ్యక్షుడయ్యాడు. కొద్దిగా గడ్డం పెంచాడు. పొడుగాటి నల్లటి ఉంగరాల జుత్తును దువ్వు కోకుండా వదిలేశాడు. ఒకసారి, తాగి అల్లరి చేసినందుకు అరెస్టయ్యాడు. షాంపేన్ గడగడా తాగేసే విద్యార్థి మిత్రులతో విచ్చలవిడిగా ఖర్చుపెట్టాడు. ఆ దశలో ఇంటికి రాసిన కొద్ది ఉత్తరాలు సైతం... కేవలం డబ్బు కోసం రాసినవే. క్రమంగా అప్పుల్లో కూరుకుపోయాడు.
తన కొడుకు ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు తండ్రి. తమ కుటుంబంలో, యూనివర్సిటీకెళ్లిన మొదటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అతడు, వెళ్లిన రోజున, అక్టోబర్ 15, 1835 నాడు, అందరూ కలసి ఉదయం నాల్గింటికి బోట్ దాకా వెళ్లి వీడ్కోలు చెప్పారు. ఇంటికి పెద్దవాడిగా కుటుంబ భవిష్యత్తు కార్ల్ మీద ఆధారపడి ఉంది. ఆర్థికంగా, నైతికంగా కూడా అయిదుగురు చెల్లెళ్లనూ, తల్లినీ ఆదుకోవాలి. హైన్రీష్ మార్క్స్ ఇల్లు నాలుగు కాలాలపాటు చల్లగా ఉండటానికి కార్ల్ తోడ్పాటు ఎంతైనా అవసరం. యూదుల సాంప్రదాయిక జీవన విధానం నుండి విడిపడి కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలి. న్యాయశాస్త్రం, సాహిత్యం, రాజకీయం - అన్ని రంగాల్లోనూ తన కొడుక్కోసం తలుపులు తెరిచే వున్నాయని తండ్రి ఆశ. కార్ల్ మార్క్స్.. బాన్‌కు వెళ్లిన కొద్దిరోజులకే ఉత్తరం ద్వారా హితబోధ చేశాడా తండ్రి. 'నీకున్న అవకాశాలు నాకుంటే, ఏమి కాగలిగేవాణ్ణో, ఆ వున్నత జీవితం నువ్వు సాధించాలని కోరుకుంటున్నాను. నా ఆశలను వమ్ము చేయవద్దు' అని.
కానీ యువ మార్క్స్, తండ్రి సలహాను పాటించినట్టు లేదు. 'లా' లో చేరాడు. ఆ సంవత్సరం పది కోర్సుల కోసం తన పేరు రిజిష్టరు చేయించుకున్నాడు. తత్వశాస్త్రం, కవిత్వం పట్ల ఆకర్షితుడయ్యాడు. 'అకడమిక్స్'కు సంబంధం లేని విషయాలలో ఇంత తలమునకలుగా ఉన్న కార్ల్ మార్క్స్ ... ఇన్ని కోర్సులు చేస్తాననటం తండ్రిని ఆశ్చర్య పరచింది. అన్నీ ఒకేసారి చేస్తానంటే ఏదీ పూర్తి కాదు. అతనికి, కొడుకు రాసిన కవిత్వం అర్థం కాలేదు. 'నాకు 'కీ' కూడా ఇవ్వు. నా అవగాహనకు ఉపయోగపడుతుంది' అని రాశాడు కార్ల్‌కు. ఆ తర్వాత, కాస్త వ్యంగ్యంగా, 'డ్యూయెలింగ్‌కూ, తత్వశాస్త్రానికీ అంత అవినాభావ సంబంధముందా!' అంటూ చురక అంటించాడు.
కొడుకుది ఆత్మవిశ్వాసమో, అహంభావమో తెలియక భయపడ్డాడు హైన్రిష్ మార్క్స్. ఏకకాలంలో లాయర్, నాటక రచయిత, కవి, రంగస్థల విమర్శకుడిగా రాణించాలనుకున్న కొడుకు మనస్తత్వం అర్థం కాలేదు. ఆరోగ్యాన్నీ, పరువు మర్యాదల్నీ, ఆర్థిక పరిస్థితినీ దృష్టిలో పెట్టుకుని హద్దులు మీరవద్దని సూచించాడు.
1836లో జరిగిన ఒక కత్తి సాము (డ్యూయెల్)లో కార్ల్‌కు కంటిపైన గాయమైంది. అయితే, ఆ గాయం అలంకారమే తప్ప ప్రమాదకరమైనదేమీ కాదు. అయినప్పటికీ, తల్లిదండ్రులు భయపడి, బాన్ వదిలి బెర్లిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లమని కార్ల్ మీద ఒత్తిడి తెచ్చారు. ఆగస్టు 22, 1836 నాడు బాన్ నుండి ప్రయాణమయ్యాడు కార్ల్.
సోఫీమార్క్స్ లేఖల ద్వారా, తన తమ్ముడి ద్వారా కార్ల్ సాహసకృత్యాలు ఎప్పటికప్పుడు జెన్నీకి తెలుస్తూనే ఉన్నాయి. ట్రేయర్‌లోని సాదాసీదా జీవితంతో పోలిస్తే మహానగరాలలో బతకటం ఖరీదైన వ్యవహారమే మరి!
కార్ల్, ట్రేయర్ వదిలి పది నెలలే గడిచింది. కానీ కుర్రాడిగా వూరు వదిలి, యువకుడిగా తిరిగి వచ్చాడు. శారీరకంగా ఎదిగాడు. మేధో పరిణితి పెరిగింది. కొత్తగా కనిపిస్తున్నాడు. జెన్నీలో కూడా మార్పొచ్చింది. ఇప్పుడామెకు ఇరవై రెండేళ్లు. అందాల భరిణె. చాలా కాలంగా రెండు కుటుంబాలకూ సన్నిహిత పరిచయముంది. జెన్నీ తండ్రి దగ్గర విద్యార్థిగా అతడు సుపరిచితడు. కానీ, ఈసారి ఇద్దరికీ కొత్తగా, మొదటిసారి ఒకర్నొకరు చూసుకున్నట్టుగా వుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, కార్ల్‌కు ఇలా లేఖ రాసింది జెన్నీ : 'ప్రియతమా! నావైపు చూసి ఎలా చూపులు పక్కకు తిప్పుకున్నావో : ఆ తర్వాత మళ్లీ చూశావు. ఆ క్షణాన నేనూ అలాగే చూశాను. చివరికి ఇద్దరం దీర్ఘంగా, సూటిగా, లోతుగా చూసుకున్నాం. కళ్లు తిప్పుకోనే లేదు.
ఆగస్టు, అక్టోబర్ మధ్య, కార్ల్ మార్క్స్ బెర్లిన్‌కు తిరిగి వెళ్లే ముందు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మార్క్స్ కుటుంబానికీ విషయం తెలుసు గాని వెస్ట్ ఫాలెన్‌లకు తెలియదు. వాళ్లకు అభ్యంతరాలుండే అవకాశముంది. ఇద్దరి మధ్యా వయో భేదం నుండి, కార్ల్‌కు సంపాదన లేకపోవటం, భవిష్యత్తును నిర్ణయించుకోకపోవటం దాకా. అయితే, అప్రకటితమైనదే అయినప్పటికీ ముఖ్యమైన అభ్యంతరం మరొకటి. సొసైటీలో హోదాకు సంబంధించింది. సాంప్రదాయకమైన, ప్రష్యన్ సామాజిక కట్టుబాట్ల ప్రకారం ఉన్నత వర్గాలలో, హోదా కాస్త ఎక్కువ, తక్కువైనా పరవాలేదు గాని, అరిస్టొక్రసీకి వెలుపల తమ ఆడపిల్లల్ని ఇవ్వటానికి తల్లిదండ్రులు అంగీకరించరు. అంతేకాదు. మతం కూడా మరొక అడ్డంకి. యూదుగా పుట్టటం అనేది పెళ్లికి అడ్డు అయినప్పుడు కోపం తెచ్చుకున్నాడు కార్ల్. జీవితకాలమంతా, మిత్రులు, శత్రువులు కూడా అతణ్ణి 'యూదు'గానే పరిగణించారు. అతడి తండ్రి మతం మార్చుకున్నంత మాత్రాన, వాళ్ల యూదు మూలాలను ట్రేయర్ సొసైటీ మరచిపోలేదు. (రైన్‌లాండ్ ప్రాంతంలో కాథలిక్కులు ప్రొటెస్టెంట్ల మధ్యన వివాహాల్ని కూడా జనం హర్షించరు.)
తమ ఎంగేజ్‌మెంట్‌ను కొంతకాలం రహస్యంగా ఉంచాలనుకున్నారు కార్ల్, జెన్నీ. నేరుగా ఉత్తరాలు రాసుకోకూడదు. జెన్నీ తల్లిదండ్రులు తమ సంబంధాన్ని అంగీకరించే దాకా ఈ జాగ్రత్తలు తప్పవు. ప్రేమ జ్వరంతో రగిలిపోతున్న కార్ల్, బెర్లిన్‌కు కోచ్‌లో అయిదు రోజులు ప్రయాణానికి బయల్దేరాడు. ఈసారి చదువును అశ్రద్ధ చేయొద్దు. ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి. తన కాళ్ల మీద తను నిలబడగలగాలి. జెన్నీకి భర్తగా ఉండగలిగే అర్హత సంపాదించుకోవాలి. ఇవీ కార్ల్ నిర్ణయాలు. ఇక జెన్నీ కూడా కఠోర నిర్ణయాలనే తీసుకుంది. ఎన్నాళ్లైనా సరే కార్ల్ కోసం తను నిరీక్షిస్తుంది. మార్క్స్ పట్ల ఆమె ప్రేమ అచంచలం. అవసరమైతే అతడి కోసం సామాజిక నియమాలను ఉల్లంఘిస్తుంది. యుద్ధం చేస్తుంది. త్యాగాల వల్ల ప్రేమ ఫలం తీపి మరింత పెరుగుతుంది.
మార్క్స్ త్వరగా చదువు ముగించి, ఉద్యోగం సంపాదించగలిగితే, ఆమె తల్లిదండ్రులను సులభంగానే ఒప్పించగలిగేదేమో! ఈ విషయం మార్క్స్‌కు కూడా తెలుసు. కానీ ఒత్తిడి పెరిగినప్పుడల్లా చేస్తున్న పనిని వదిలి మరో వ్యాపకం పెట్టుకోవడం అతడి స్వభావం. ఇది అనేకసార్లు రుజువైంది. తీరా పని ముగుస్తుందనుకున్నప్పుడు, మరో పుస్తకం చదవాలి, మరికొంత సమాచారం కావాలి అనుకుంటాడు. కొన్ని విషయాలు మాతృభాషలో చదవాలంటే ఆ భాష నేర్చుకోవాలి. ఇలా... బెర్లిన్‌లో చెయ్యదలచుకున్నది ముగించకుండా ఉండటానికి ఎన్ని మార్గాలో...
***
యూనివర్సిటీ మొదటి టర్మ్‌లో తను ఒంటరినని ఫీలయ్యాడు మార్క్స్. ఇక్కడి విద్యార్థుల సంఖ్య రెండు వేలు. అంటే బాన్‌కన్నా మూడింతలు. అంతే కాదు. బాన్‌తో పోలిస్తే బెర్లిన్ మహానగరం. జనాభా మూడు లక్షలు దాటింది. జర్మన్ సంఖ్యలో, రెండవ పెద్ద నగరం (మొదటిది వియెన్నా). 'యూరప్‌లోని అత్యంత ప్రముఖ యూనివర్సిటీ బెర్లిన్'. వ్యక్తిగత ప్రతిభకూ, ఒరిజనల్ రిసర్చ్‌కూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. జెన్నీ పట్ల వివాహం దహించుకు వేస్తున్నది. వెరసి తండ్రి ఒక లేఖలో రాసినట్టుగా 'ఒక పద్ధతి లేకుండా అన్ని పనులూ ఒకేసారి చేయాలనుకోవటం అన్ని శాఖల జ్ఞానమంతా తక్షణం సంపాదించుకోవాలనుకోవటం దీపం ముందర నిరంతరంగా తల పట్టుకుని కూర్చోవటం. చెదరిన జుత్తుతో, డ్రెస్సింగ్ గౌన్‌లో అటూ ఇటూ తిరగటం.... ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటం... ఇదంతా అర్థం పర్ధం లేని, దారి తప్పిన జ్ఞాన తృష్ణ.'' వాస్తవాన్ని గ్రహించి, తనను తాను సరిదిద్దుకొమ్మని కార్ల్‌ను అర్థించాడు హైన్రిష్. కానీ అప్పటికే తండ్రి సలహాలు పాటించే స్థితిలో లేడు కార్ల్.
(సశేషం)
స్వేచ్ఛానువాదం: ముక్తవరం పార్థసారథి, ఫోన్: 91776 18708
No comments:
Post a Comment